కోనసీమలో నిఘా వైఫల్యం

share on facebook

ముందస్తు అంచనా వేయడంలో విఫలం
ఆందోళనకారులను గుర్తించలేకపోయిన పోలీసులు
అమలాపురం,మే25(జ‌నంసాక్షి): ఏ పేరువద్దు.. కోనసీమ ముద్దు.. అంటూ చేపట్టిన ఆందోళన అదుపు తప్పింది. సామాజిక వర్గాల ఆందోళనగా కోనసీమ ఆందోళన తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగించే అంశం.పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ జేఏసీ పేరిట మరో ఉద్యమం మొదలైంది. అదే పేరును ఉంచాలని కోరుతూ వ్యక్తిగతంగా వినతిప త్రాలు ఇచ్చేందుకు గ్రామాల వారీగా ఆందోళనలు ప్రారంభ మయ్యాయి. దీనిలో భాగంగా మంగళవారం భారీ ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు పిలుపునిచ్చారు. పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా భారీ భద్రత ఏర్పాటుచేసి అడుగడుగునా అడ్డగించడంతో ఉద్యమం అదుపు తప్పి విధ్వంసానికి కారణమైంది. ప్రశాంతంగా ఉండే కోనసీమ భగ్నమైంది. సామాజికవర్గాల వార్‌ ప్రారంభానికి జిల్లా పేరు మార్పే వేదికైంది. జిల్లాల విభజనలో భాగంగా తూర్పుగోదావరి నుంచి కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పా టుచేసింది. కానీ కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని మార్చి, ఏప్రిల్‌లో తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరిగాయి. కానీ విభజన తర్వాత ప్రభుత్వం అంబేడ్కర్‌ జిల్లా పేరును పక్కనపెట్టి కేవలం కోనసీమ జిల్లాగానే అధికారికంగా
కొనసాగించింది. దీనికి నిరసనగా కోనసీమ జిల్లావ్యాప్తంగా పలు దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ముట్టడికి దిగాయి. దీంతో ఆందోళనలు, నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం కోనసీమ జిల్లాను బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లాగా పేరు మార్చుతూ ఈనెల 18న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో ఒక వర్గం సంబరాలు చేసుకోగా, మరో సామాజికవర్గం ఆందోళనలకు దిగింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఉద్యమానికి సిద్ధమైంది. అదే సమయంలో ఈనెల 19న తెల్లవారు జామున అయినవిల్లి మండలం శానపల్లి లంకగ్రామంలో స్థానిక ప్రజలు, కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళన లకు దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించడం కలకలం రేపిం ది. తిరిగి ఈనెల 20న కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలా పురం కలెక్టరేట్‌ ముట్టడికి అయిదు వేల మంది వరకు తరలివచ్చారు. అదే సమయంలో పోలీసులు వీరిని నియంత్రించారు. అయినా పోలీసులను కాదని కలెక్టరేట్‌ను ముట్టడిరచా రు. దీంతో అప్పటి నుంచి కోన సీమ జిల్లా పేరు కొనసాగించా లంటూ ఆందోళనలు చేసేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ లు చేయడం మొదలుపెట్టారు. జిల్లా పేరు కొనసాగించాలని కోరుతూ జేఏసీ మంగళవారం కలెక్టరేట్‌కు ర్యాలీ చేపట్టగా, అది ఇలా అదుపు తప్పింది. పోలీసులకు సరైన అంచనా లేకపోవడం వల్లే పరిస్థితి తప్పినట్టుగా కనిపిస్తోంది. పోలీసు ఉన్నతాధికా రులకు కోనసీమ పరిస్థితుల పట్ల అవగాహన లేకపోవడం, స్థానిక అధికారులకు ప్రజలతో సంబంధాలు కొరవడడంతోపాటు నిఘావర్గాలు నిద్రావస్థలో ఉండడం వెరసి అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్లకు పరోక్షంగా కారణమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా అమలాపురం కేంద్రంగా జిల్లా ఆవిర్భవించడంతో పోలీసు అధికారులు వివిధ ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడ నియమించారు. చాలామంది పోలీసు అధికారులకు కోనసీమ పూర్వపు పరిస్థితులపై అవగాహన లేదు. దీనికితోడు గ్రావిూణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందనే నిఘా సమాచారం రాబట్టుకోవడంలో పోలీసులు పెద్దగా దృష్టి సారించలేదు. వీటన్నింటి పర్యవసానమే అమలాపురంలో ఆందోళనల తీవ్రతకు పరోక్షంగా కారణమయ్యారు. అయితే పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందారు. కొద్దిమందిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించడంపైనే దృష్టి పెట్టారు తప్ప భారీ మొబలైజేషన్‌ అవుతున్న ప్రాంతాలపై వారికి అవగాహన లేకపో వడంతో పట్టించుకోలేదు. సరిగ్గా ప్రకటించిన సమయానికే ఆందోళన కారులు వివిధ మార్గాల గుండా రోడ్డెక్కి సినిమా ఫక్కీలో వేలాదిగా ర్యాలీ చేశారు. జనసవిూకరణ ప్రాంతాలను విస్మరించడం వల్లే నిరసన ర్యాలీకి భారీగా ప్రజలు సవిూకృతలయ్యారు. నిఘా వైఫల్యం అడుగడుగునా కనిపించింది. ముందుగా వ్యాపార సంస్థలను మూయించి వేసినప్పటికీ సవిూప ప్రాంతాల పరిస్థితులను అంచనా వేయడంతో వైఫల్యం చెందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల మధ్య సమన్వయ లోపం కొంత తలెత్తింది. దీనికితోడు ఉద్యమకారులతో ఉన్నతాధికారులు ముందస్తు సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలుగాని, హెచ్చరికలుగాని చేస్తే పరిస్థితి కొంత అదుపులో ఉండేదని భావిస్తున్నారు. ప్రశాంతమైన అమలాపురంలో వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొంతమంది సంఘవిద్రోహశక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అల్లర్లను ప్రోత్సహించేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

Other News

Comments are closed.