తెలంగాణ శక్తులతో కలిసేందుకు సిద్ధం : కోమటి రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రభుత్వం లేదని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అంశంలో ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లక్ష్య సాధన కోసం అవసరమైతే తెలంగాణ శక్తులతో కలిసి పని చేసేందుకు వెనుకడుగు వేయిబోనని అన్నారు.దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలియజేశారు. ఆయనను కట్టడి చేయాలని కోరుతామన్నారు. ఇకపోతే తెలంగాణవాదాన్ని వీడేలేదన్నారు. ఈ అంశంపై రాష్ట్రపతి ఎన్నికలకు ముందుగానే ఓ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీని వీడి, తెలంగాణ శక్తులతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు.