నేడు ‘ఊరు మనదిరా’ కార్యక్రమం.

బెల్లంపల్లి, మార్చ్ 4, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని నంబర్ 2 మైదానంలో ఆదివారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ప్రజా కవి, రచయిత గూడ అంజన్న యాదిలో ఊరు మనదిరా వాడ మనదిరా అనే పోరుబాట నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి నియోజకవర్గం సిపిఐ ఇంచార్జి రేగుంట చంద్రశేఖర్ తెలిపారు. ఈకార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, యుద్ధ నౌక గద్దర్, కళాకారులు మిట్టపల్లి సురేందర్, వందేమాతరం శ్రీనివాస్, విప్లవ చిత్రాల హీరో, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, రాంబాబు, తేలు విజయ, జయరాజ్, కోదండరాం, మంద కృష్ణ మాదిగ, ఏపూరి సోమన్న, గోరేటి వెంకన్న, అంతడుపుల నాగరాజు ఇంకా అనేక మంది కళాకారులూ హాజరు కానున్నారని తెలిపారు. విప్లవ పాట ప్రజల్లో ఇంకా బతికే ఉందని, పాటలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాదించడం జరిగిందన్నారు. అలాంటి కళాకారుడు గూడ అంజన్న మరణం తీరని లోటని, ప్రజాకవి గూడ అంజన్న యాదిలో జరిగే బహిరంగ సభలో ప్రముఖులు, ప్రజా కళాకారులూ పాల్గొంటారని, ఈకార్యక్రమంలో కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.