పాక్‌లో పెషావర్ విమానాశ్రయంపై దాడి : ఉగ్రవాదులు మృతి
ఇస్లామాబాద్: వాయువ్వ పాకిస్థాన్ నగరమైన పెషావర్‌లోని విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ క్రమంలో పాక్ భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు సాధారణ పౌరులు, ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాణాంతక దాడుల్లో 40 మంది గాయపడగా వారిని ఖైబర్ టీచింగ్ హాస్పిటల్‌లో చికిత్సకు తరలించారు. గాయపడినవారిలో బాలలు, మహిళలు కూడా ఉన్నాయని సమాచారం.
దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తొలుత ఐదు రాకెట్లను ప్రయోగించారు. వీరంతా సూసైడ్ వెస్ట్‌లు ధరించి రైఫిళ్ళతో శనివారం రాత్రి పెషావర్‌లోని బచ్చా ఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు చేసిన తీవ్ర ప్రయత్నాలను పాక్ బలగాలు అడ్డుకున్నాయి. ఉగ్రవాదులు ప్రయోగించిన మూడు రాకెట్లు విమానాశ్రయ ప్రాంగణంలోనే పడినప్పటికీ వాటి వల్ల నష్టమేదీ జరగలేదు. మరో రెండు రాకెట్లు నివాస ప్రాంతాల్లో పడ్డాయి.
ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో విమానాశ్రయ ప్రహారీ గోడను ఢీ కొట్టించారు. ఈ ప్రాంతానికి సమీపంగా ఉన్న అబ్‌ద్రా అనే గ్రామం నుంచి ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు పాక్ వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాదుల సూసైడ్ జాకెట్లను బాంబు దళం నిపుణులు నిర్వీర్యం చేశారు.