బోరు బావి ఘటన విషాదాంతం చిన్నారి మహి మృతి

శ్రీబావిలోనే మృతి చెందిన మాహి శ్రీ86 గంటల శ్రమ వృథా
శ్రీబోరున విలపించిన తల్లిదండ్రులు
మానేసర్‌ : బోరుబావిలో పడిన చిన్నారి మహి కన్నుమూసింది. ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మహి బోరు బావిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రక్షణ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు బయ టకు తీశారు. అనంతరం మానేసర్‌లోని ఇఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. బావిలో పడిన రోజే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ ధృవీకరించారు. హర్యానా లోని మానేసర్‌లోవిషాద చాయలు అలుము కున్నాయి. మహి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. 86 గంటల పాటు ఆర్మీ, ఢిల్లీ మెట్రో సిబ్బంది, గుర్గావ్‌ మెట్రో సిబ్బంది, భద్రతా దళం శ్రమించినా.. ఫలితం దక్కకపోవడంతో అందరిలోనూ విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 20వ తేదీ..ఆ రోజు మహి పుట్టినరోజు.. నాలుగేళ్ల్ల మహి ఆ రోజు రాత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ వెళ్లి కొంతదూరంలో ఉన్న బోరు బావిలో పడిపోయింది. 70 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో నుంచి మహిని వెలికి తెచ్చేందుకు ఆర్మీ, ఢిల్లీ మెట్రో సిబ్బంది, జాతీయ భద్రతా దళం, గుర్గావ్‌ మెట్రో రైలు ఇంజనీర్లు మొత్తం 150మంది వరకు రంగంలోకి దిగారు. మహి పడిన బోరుబావిలోకి ఆక్సిజన్‌ పంపారు. మహి పడిన బోరుబావికి సమాంతరంగా మరో బోరు బావిని తవ్వారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ వారంతా తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మహిని బయటకు తెచ్చారు. వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. బోరు బావిలో పడిన రోజే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. గుర్గావ్‌ జిల్లా కలెక్టర్‌ కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. మహి తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.