రెండు నెలల్లో తెలంగాణ ప్రకటించండి

ప్రణబ్‌కు నేను ఓటెయ్యను
జండాలు పక్కనబెట్టి
పోరుకు సిద్ధం కండి : నాగం.
హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి):
రెండు నెలల్లో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షులు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన చేస్తుందని, దీనిని ఎన్నికల అంశంగా మాత్రమే చూస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని సార్లు ఓడినా జ్ఞానోదయం కలగడం లేదన్నారు. తెలంగాణపై ఆలస్యం చేస్తే ఆ పార్టీకి పుట్టగతులుండవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో ప్రణబ్‌ కమిటీ ఎటూ తేల్చలేదని అలాంటప్పుడు తెలంగాణ ప్రతినిధుల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రణబ్‌కు ఓటేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు నెలల్లో తెలంగాణ ప్రకటించకపోతే జండాలు పక్కనపెట్టి పోరుచేయడానికి సిద్దమని ఆయన అన్నారు.