షిండే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణపై జనవరి 28లోగా ప్రకటన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఒక అడుగు ముందు ఉన్నారని ఆయన కితాబిచ్చారు. వారు తెలంగాణపై వెంటనే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులకు తెగింపు లేక పోవడం వల్లే తెలంగాణ ఆలస్యం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో  జగన్‌ కోవర్టులు చాలా మందే ఉన్నారని, కేవీపీ కూడా జగన్‌ కోవర్టేనని ఆయన పేర్కొన్నారు.

జైల్లో ఉండాల్సిన వ్యక్తి కేవీపీ

వైఎస్సార్‌ ఆత్మనని చెప్పుకున్న కేవిపీ రామచంద్రరావు చంచల్‌గూడ జైళ్లో జగన్‌ పక్కన ఉండాల్సిన వ్యక్తి అని కేటీఆర్‌ దుయ్యబట్టారు. జగన్‌కు కూడా తెలియకుండా కేవీపీ ఎన్నో కుంభకోణాలు చేశారని, ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో కోనసాగుతున్నందునే కేవీపీని జైలుకు పంపలేదని, లేకుంటే ఎప్పుడో జైలుకెళ్లేవాడని తెలియజేశారు.