హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం

కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
భారీబందోబస్తు మధ్య ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు
హైదరాబాద్‌,నవంబర్‌1(జనంసాక్షి) : అత్యంత ఉత్కఠంభరితంగా ఎదురుచూస్తున్న నేటి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ పక్రియను ఎలాంటి పొరపాట్లు, వివాదాలకు తావులేకుండా, సజావుగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ కోరారు. జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం పోలింగ్‌ ముగిసిన అనంతరం ఇవిఎంలను కరీంనగర్‌ ఎస్సారార్‌ కాలేజీకి తరలించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. ఈ సమయంలో తారుమారు చేసినట్టు వస్తున్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవోను శశాంక్‌గోయల్‌ వివరణ కోరారు. ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా చేపట్టాలని, పోటీచేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల సీల్‌ తొలగించి ఓట్లు లెక్కించాలని ఆదేశించారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్టాంª`రగ్‌ రూంలో ఈవీఎంలను భద్రపర్చారు. ఇక్కడ స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించి మూడంచెల భద్రతను కల్పించారు. రెండో తేదీన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్టు కరీంనగర్‌లో రిటర్నింగ్‌ అధికారి, హుజూరాబాద్‌ ఆర్డీవో సీహెచ్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్‌ ఏర్పాటుచేశామని, 22 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తామని వెల్లడిరచారు. ఈవీఎం లు మార్చారని సోషల్‌ విూడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రవీందర్‌రెడ్డి
ఖండిరచారు. మాక్‌ పోలింగ్‌లో మొరాయించిన వీవీ ప్యాట్‌ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి మార్చామని తెలిపారు. వీవీ ప్యాట్‌లో ఓట్లు ఉండవని, ఈవీఎంలలోనే ఓట్లు నిక్షిప్తమై ఉంటాయని వివరించారు. ఇరు రాజకీయపక్షాలు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలోనే ప్రతి ఓటును సీరియస్‌గా పట్టించుకోవడంతో పోలింగ్‌ శాతం పెరిగింది. మంత్రి హరీష్‌రావు హుజురాబాద్‌ ఓటర్లలో చైతన్యాన్ని తెచ్చామని, కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ప్రజల ఆశీస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నామని ప్రకటించారు. హుజురాబాద్‌ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా చరిత్రను తిరగరాశారని ఈటల రాజేందర్‌ అన్నారు. నాయకులు లేని ప్రాంతాల్లో ప్రజలే నాయకులుగా నిలిచి తనకు మద్దతు తెలిపారని ఆయన చెప్పారు. నవంబరు 2 తర్వాత తెలంగాణలో రాజకీయంగా పెనుమార్పులు వస్తాయని, తన గెలుపును తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నానని రాజేందర్‌ పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని 31 గ్రామాల్లో 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలోని 102 బూత్‌లో 93.93 శాతం పోలింగ్‌ నమోదైంది. జమ్మికుంట మండలం కోరపల్లిలోని 160 బూత్‌లో 93.91, కమలాపూర్‌ మండలం గూనిపర్తిలో 93.41 శాతం ఓటర్లు ఓటేశారు. ఇల్లందకుంట మండలం మల్యాలలోని 234 బూత్‌లో 93.57 శాతం, 235లో 93.42 శాతం, 236లో 93.04 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల చరిత్రలో నోటిఫికేషన్‌ రాకముందే ప్రచారం ప్రారంభించి ఇంత సుధీర్ఘకాలం రాజకీయపక్షాలు దీన్ని కొనసాగించడం ఇదే ప్రథమం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడిరది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 84.63 శాతం జరుగగా ఇప్పుడు పోలింగ్‌ శాతం 86.33 శాతానికి చేరింది.