అండర్సన్ పై మండిపడ్డ ఇంజిమామ్
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఇంగ్లాండ్ బౌలర్ జిమ్మి అండర్సన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్-ఉల్-హక్ తప్పుబట్టారు. కోహ్లీ ఆటతీరు గురించి ప్రశ్నించేముందు మొదట అండర్సన్ భారత్‌లో వికెట్లు తీయాలని సూచించాడు. ‘కోహ్లీ ఆటలో మార్పు వచ్చిందని అనుకోవడం లేదు, అతడి బ్యాటింగ్‌లో లోపాలు ఇక్కడి పిచ్‌లపై కనిపించడం లేదంతే. పిచ్‌ల్లో వేగం, స్వింగ్ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌లో మాదిరిగా కోహ్లీని ఔట్ చేయలేకపోయాం’ అని అండర్సన్ కోహ్లీపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని ఇంజిమామ్ అన్నాడు. అండర్సన్ భారత్‌లో పెద్దగా వికెట్లు తీసినట్లు నేను చూడలేదని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజిమామ్ పేర్కొన్నాడు. ‘ఇంగ్లాండ్‌లో పరుగులు చేస్తేనే వారు నాణ్యమైన బ్యాట్స్‌మెన్ అని సర్టిఫికెట్ ఇస్తారా? ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఉప ఖండంలో ఆడటానికి ఇబ్బందులు పడటం లేదా? అంటే ఆ జట్లు బలహీనమైనవని, ఆటగాళ్లు సరిగ్గా ఆడటం లేదని అనుకోవాలా? నా దృష్టిలో అయితే ఎక్కడ పరుగులు చేసిన ఒక్కటే. వాటిని పరుగులుగానే పరిగణించాలి’ అని పాక్ మాజీ కెప్టెన్ అన్నాడు.