అంతర్జాతీయ యోగా డే: అంబాసిడర్లుగా అమితాబ్, కోహ్లీ!

snwyjaan
న్యూఢిల్లీ: యోగా ప్రచారం కోసం ఇప్పటికే సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల సేవల్ని ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటి, శిల్పాశెట్టి, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ లాంటి వారిని యోగాకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించనున్నట్లు కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో యోగా ప్రదర్శనలు భారీగా నిర్వహిస్తామనీ, రాజ్‌పథ్‌లో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొంటారని తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరై యోగా విశిష్టత గురించి వివరిస్తారరని తెలిపారు. భారత్ ప్రతిపాదనతో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. యోగా డేకు177 దేశాల మద్దతు లభించింది. జూన్ 21న మన దేశంలోని 651 జిల్లాలతోపాటు ఢిల్లీలో పెద్దసంఖ్యలో యోగా శిబిరాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇదిలావుంటే, పాఠశాలల్లో యోగా, సూర్య నమస్కారాలను తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది.