అంతా కాంగ్రెస్ తాను ముక్కలే
కెసిఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే
ప్రజల సమస్యలపై తెగబడ్డోళ్లకే టిక్కెట్లు: రేవంత్
హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): రాజకీయల్లో పేరుమోసిన వారంతా కాంగ్రెస్‌తోనే రాజకీయం ప్రారంభించారని తెలంగాణ పీసీసీ చైర్ఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. చంద్రబాబు… కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళేనని అన్నారు. వారిని కూడా యూత్ కాంగ్రెస్ అందించిందని అన్నారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం విూద ఏ మేరకు పోరాటం చేస్తున్నారో చూస్తామన్నారు. టికెట్ తీసుకుని జనం లోకి పోతా అంటే… ఓడిపోతారు . పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారు అని తెలిపారు. రేవంత్ పార్టీ మారలేదా అంటున్నారు. రేవంత్ పార్టీ మారింది… ప్రతిపక్షంలో చేరి కొట్లాడేందుకే.. కానీ అధికార పార్టీ లోకి…అధికారం కోసం పోలేదన్నారు. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకుని అంటేఎవరు పట్టించుకోరు. పని చేసే వారికి గుర్తింపు ఉంటది అని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఓనర్లు లేరని.. కష్ట పడ్డోల్లే ఓనర్లన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తనను చూసి ఎదగడం నేర్చుకోవాలన్నారు. తాను 15 ఏళ్లల్లో పీసీసీ చీఫ్ వరకు ఎదిగానన్నారు. తాను ఏనాడు పదవుల కోసం పార్టీలు మారలేదన్నారు. పార్టీ ఇబ్బందుల్లో ఉందనే తనను పీసీసీ చీఫ్ గా నియమించిందన్నారు. యువకుడు గట్టిగా కొట్లాడుతాడని భావించిన కాంగ్రెస్..తన అవసరం, స్పీడ్ ను చూసి పదవులు కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ లో యువకులు మంచ అవకాశాలుంటాయన్నారు. విూరు కష్టపడితే.. విూ ఇంటికొచ్చి టికెట్ ఇచ్చే బాధ్యత తనదన్నారు. వైఎస్సార్ కు 34ఏళ్లకే పీసీసీ చీఫ్‌గా రాజీవ్ గాంధీ అవకాశం ఇచ్చారన్నారు. మమత బెనర్జీ, అంబికా సోనీ, సంజయ్ గాంధీ, శరత్ పవర్ లాంటి వాళ్ళు యూత్ కాంగ్రెస్ నాయకులుగా పనిచేశారన్నారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని.. కానీ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి చదువుతున్న వాళ్ళు కనిపిస్తున్నారన్నారు. వారికి ఇంకా ఎందుకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఉద్యోగ నియామకాలను మరచిన సిఎం కెసిఆర్ అంటూ విమర్శలు చేశారు.