అక్బర్‌ చాలా మంచి జర్నలిస్ట్‌

కోర్టుకు తెలిపిన మరో మహిళా జర్నలిస్ట్‌

న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ పక్కా జెంటిల్‌మన్‌ అని, బ్రిలియంట్‌ టీచర్‌ అని ఆయనతో గతంలో కలిసి పనిచేసిన ఓ మహిళా జర్నలిస్ట్‌ దిల్లీ కోర్టులో వెల్లడించారు. దిల్లీ కోర్టులో ఎంజే అక్బర్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో జోయీతా బసు అనే జర్నలిస్ట్‌ ఆయనకు మద్దతుగా మాట్లాడారు. ఆయనపై కావాలనే దుష్పచ్రారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రియా రమణి చేసిన ట్వీట్లు చదివిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేశారని అనిపించిందని, ఆయన ప్రతిష్ఠను తిరిగి తీసుకురాలేనంతగా దెబ్బతీశారని అన్నారు. ఆయన మంచి పేరును చెడగొట్టేందుకు ఇలా చేశారని కోర్టులో తెలిపారు. ప్రియా రమణి ట్వీట్లు చూసి షాక్‌కు గురయ్యానని, నిరాశ, అసహనం కలిగాయని చెప్పారు. అక్బర్‌ తనకు 1998 నుంచి తెలుసని, ఆయన గురించి తప్పుగా వినలేదని తెలిపారు. ఆయనను బ్రిలియంట్‌ జర్నలిస్ట్‌, గొప్ప రచయితగా, పూర్తి జెంటిల్‌మన్‌గా భావిస్తానని చెప్పారు. పలువురు మహిళలు ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పదవి నుంచి తప్పుకున్న మరుసటి రోజే ఆయన ప్రియారమణిపై పరువు నష్టం దావా వేశారు. అందులో సాక్షులుగా పేర్లు ఇచ్చిన ఆరుగురిలో జోయీతా బసు ఒకరు. ఎంజే అక్బర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనతో గతంలో కలిసి పనిచేసిన మహిళా జర్నలిస్ట్‌ ప్రియా రమణి తొలుత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత మరికొందరు అదే బాటలో ముందుకు వచ్చారు. అక్బర్‌ తమను కూడా వేధించాడని ఆరోపణలు చేశారు. అయితే అక్బర్‌ మాత్రం ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారు.