అఖిలపక్షంపై పవార్ ఫైర్
పదే పదే రావద్దని కన్నాపై ఆగ్రహం
విస్తుపోయిన ‘అఖిల’ బృందం
న్యూఢిల్లీ, ఆగస్టు 23 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీలో గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌తో భేటీ అయ్యేందుకు మంత్రి కన్నా ఆధ్వర్యంలో అఖిలపక్షం బృందం ఢిల్లీ వెళ్లింది. నూతన విత్తన విధానంపై ఆయనతో చర్చించి సవరణలను వివరించేందుకు ఈ బృందం పవార్‌తో భేటీ అయింది. అయితే కన్నా బృందాన్ని చూసిన వెంటనే వారిపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేపదే ఎందుకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే విషయంపై ఎన్నిసార్లు చెబుతారు అంటూ అసహానం వ్యక్తం చేశారు. పవార్ ఈ ఉదయం 11.30గంటలకు కన్నా బృందానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అదే సమయానికి కన్నా బృందం వెళ్లింది. అఖిలపక్షంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు కెవిపి రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, కిల్లీ కృపారాణి, ఉండవల్లి అరుణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అక్కడకు వచ్చిన పవార్ కన్నాను చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు. మంత్రి మారినప్పుడల్లా ఇలా వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. యుద్దానికి వస్తున్నారా, వినతులతో వస్తున్నారా అంటూ ఆయన మంత్రి కన్నాపై విరుచుకుపడ్డారు. ఒకసారి చెబితే సరిపోతుందని, రైతుల సమస్యలు తమకు తెలుసునని, ఎన్నిసార్లు కలుస్తారని, పదేపదే రావాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై తమకు అవగాహన ఉందని ప్రతిసారి వచ్చి ఇంత హడావుడి చేయడం అవసరమా అని ప్రశ్నించారు. వేళాపాళా లేకుండా వచ్చేస్తున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. శరద్ పవార్ ఆగ్రహం చూసి కన్నా అవాక్కయ్యారు. మంత్రికి సమస్యలు చెబుతామని వస్తే ఆయనే ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల అక్కడే ఉన్న ఎంపీలు సైతం కంగుతిన్నారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తారనుకుంటే ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని వారు జీర్ణించుకోలేపోతున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన కన్నాను ఈ విషయమై ప్రశ్నించగా, పవార్ తమపై ఆగ్రహం వ్యక్తం చేయలేదని ఏదో సరదగా మాట్లాడారని, దానికి విపరీతార్థాలు తీయాల్సిన అవసరం లేదన్నారు. సాధ్యమైంత త్వరలో విత్తన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని పవార్ హామి ఇచ్చారని అన్నారు. విత్తనాల ధర నిర్ణయం కంపెనీల చేతుల్లోనే ఉంటుందని పవార్ సూత్రపయంగా చెప్పారని కన్నా తెలిపారు. ఐదేళ్లుగా విత్తన బిల్లు వ్యవహారం పెండింగ్‌లో ఉందని దానిని పరిష్కరించాలని పవార్‌ను కోరామన్నారు. అయితే మంత్రి కన్నా వెంట ఉన్న ప్రతినిధులు మాత్రం పవార్ వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రితో రైతుల సమస్యలను ప్రస్తావించడానికి వస్తే కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరించారని వారు విమర్శించారు.