అఖిలేశ్‌పై చిదంబరం ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి):
యూపీఏ ప్రభుత్వానికి సమాజ్‌వాది మద్దతు డోలాయమాన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ప్రభుత్వానికి ఢోకా ఏమీలేదని, పూర్తిగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేస్తామని ఉద్ఘాటిస్తుండగా సమాజ్‌వాది పార్టీ మాత్రం మరో రకమైన వాదన వినిపిస్తోంది. యూపీఏ పూర్తి కాలం అధికారంలో ఉండలేదని, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని ఆ పార్టీ రామ్ అశ్రే కుష్‌వాహ చెబుతున్నారు. మన్మోహన్ ప్రభుత్వం ఎంతో కాలం అధికారంలో ఉంటుందని నాకు నమ్మకం లేదు. కచ్చితంగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు వస్తాయని అన్నారు. ఓ వైపు యూపీయే, ఎస్‌పీ మధ్య మాటల యుద్ధం, హెచ్చరికలు జరుగుతుండగానే మరోవైపు ఆర్థిక మంత్రి చిదంబరం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కలిసి లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోవడం విశేషం. సమాజ్‌వాది పార్టీ మద్దతు ఉపసంహరించుకోవచ్చని ప్రధాని చెబుతుండగా యూపీ అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు తాను సిద్ధమేనని ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. అంతేకాక అఖిలేష్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘అఖిలేష్ యువ ముఖ్యమంత్రి. ఆయన రాజకీయ జీవితాన్ని గొప్పగా ప్రారంభించారు. ఒక విధానంలో యూపీని ఉన్నత స్థానానికి చేర్చడంలో ఆయన, ఆయన బృందం బాగా పనిచేస్తోంది. ఉత్తర ప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇస్తున్నా’ అని చిదంబరం అన్నారు.