అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి : కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

ఎల్బీనగర్  (జనం సాక్షి )   భారత ఆర్మీలో అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు దేశ భద్రతకు పెను ముప్పుగా మారనున్నాయని   మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దేప భాస్కర్ రెడ్డి   అన్నారు. భారత సైనిక దళంలో నియామకానికి అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు      మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా లో మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో   పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా     దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు యువత ఆశలను నీరుగార్చే విధంగా ఉన్నాయని జెపిఆర్ తెలిపారు. ఇది ఏమాత్రం క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ పథకం దేశంలోని యువతలో అగ్నిని రాజేష్తోందని, ఇది దేశ భద్రతకు శ్రేయస్కరం కాదని అన్నారు. మోడీ ప్రభుత్వం మొదటి నుంచి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు .  ఆర్మీ లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యానికి గురి చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఇలాంటి నిర్ణయంతో  యువత హృదయం గాయపడిందని అన్నారు.
భారత దేశం సరిహద్దుల్లో ప్రమాదకర పొరుగు దేశాలు పొంచి ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శత్రువులతో ప్రమాదం ఉంటున్న ఇలాంటి సమయంలో ఆర్మీ లో అగ్నిపధ్ వంటి పథకం అమలులోకి తీసుకుని రానుండటం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చునని  వివరించారు.
అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలలో ప్రతి పౌరునికి మిలటరీ శిక్షణ తప్పనిసరి అని, అందు కోసం ఆయా దేశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుందని అన్నారు. అలాంటి పరిస్థితులు మన దేశంలో లేవని, ఆ దేశాల పద్దతులను కాపీ కొడితే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానపరమైన నిర్ణయంతో జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని, మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని  మండిపడ్డారు. లాభాల బాటలో బ్రహ్మాండంగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయినా రైల్వే, ఎల్ఐసి, బి.ఎస్.ఎన్.ఎల్, బి.హెచ్.ఇ.ఎల్, బ్యాంక్స్, వివిధ ఆయిల్ కంపెనీలు, ఈ.సీ.ఐ.ఎల్ వంటి అనేక సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, ఆ కుట్రలో భాగమే అగ్నిపథ్ నిర్ణయం తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోందని  అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రతిసారి సాయుధ బలగాలను ఎగతాళి చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా రాజుకుంటున్న ఆగ్రహ జ్వాలలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని దేప భాస్కర్ రెడ్డి    పేర్కొన్నారు.