అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం
రాజమహేంద్రవరం,అక్టోబర్29(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ
ఘటనలో 61 పూరి గుడిసెలు క్షణాల్లో దగ్ధమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో గుడిసెలు కాలి ప్రజలు కట్టుబట్టలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ ఇంట్లో విద్యుదాతాఘాతం వల్లనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇళ్లన్నీ కాలిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం కారణంగా కట్టుబట్టలతో మిగిలామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.