అగ్రిగోల్డ్ ఆస్తులపై.. అమిత్‌షా కుమారుడి కన్ను
– కారుచౌకగా ఆస్తులను కొట్టేసేందుకు కుట్రచేస్తున్నారు
– బీజేపీ కుట్రలను అగ్రిగోల్డ్ బాధితులు తిప్పికొట్టాలి
– వచ్చే ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి పోలవుతాయి
– విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
అమరావతి, అక్టోబర్23(జనంసాక్షి) : అగ్రిగోల్డ్ ఆస్తులపై బీజేపీ చీఫ్ అమిత్‌షా కుమారుడు కన్నేశారని ఆరోపించారు శాసనమండలి విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. బీజేపీ నేతల కామెంట్ల కౌంటర్ ఇస్తూ… అమిత్ షా కుమారుడికి అగ్రిగోల్డ్ భూములు కట్టబెట్టేందుకు రాంమాధవ్, జీవీఎల్ నర్సింహారావు, కన్నా లక్ష్మీనారాయణ పక్కా ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. ఎస్సెల్ గ్రూపును భయపెట్టి పంపేసింది అమిత్ షానే అని ఆయన ఆరోపించారు. అగ్రి గోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు బీజేపీ పెద్దలు కుట్ర పన్నారని ఆరోపించారు. దీనిని అగ్రిగోల్డ్ బాధితులు తిప్పికొట్టాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. ఏపీలో రాష్ట్ర ద్రోహుల ముఠా సంచరిస్తోందంటూ మండిపడ్డ ఆయన… రాష్ట్ర ద్రోహుల ముఠా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటానడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మోడీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తే, రాష్ట్రాన్ని జీవీఎల్ భ్రష్టు పట్టిస్తున్నారని బుద్దా విమర్శించారు. సెక్యూరిటీ లేకుండా బీజేపీ నేతలు తిరగలేరంటూ సెటైర్లు వేశారు. జీవీఎల్ తెల్ల కాగితాలపై లెక్కలు చూపించి విమర్శలు చేస్తున్నారని బుద్దా మండిపడ్డారు. యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జీవీఎల్ రూ. 200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. తాను జీవీఎల్ తో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జీవీఎల్ స్థాయికి నేనే ఎక్కువ, లోకేష్ ఎందుకని ప్రశ్నించారు. సీబీఐలో వర్గపోరును ప్రొత్సహిస్తోంది బీజేపీయేనని విమర్శించారు. సీబీఐలో వర్గ పోరుతో మోడీ తలపట్టుకుని కూర్చున్నారన్నారు. ఇక విజయవాడలో నాపై పోటీచేసి బీజేపీ గెలిస్తే రాష్ట్రం వదిలిపోతా నంటూ సవాల్ చేసిన బుద్దా వెంకన్న… వచ్చే ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి పడతాయన్నారు. రాబోయే ప్రభుత్వంలో కీలకం అవుతారని రాంమాధవ్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఈయన మాటలతో వైసీపీ, జనసేన, బీజేపీల కుమ్మక్కు స్పష్టమవుతుందని బుద్దా వెంకన్న అన్నారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.