అగ్రిగోల్డ్ ఆస్తులపై.. సీబీఐ విచారణ జరిపించాలి
– ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలు
– ప్రభుత్వం కుట్రను బయటపెట్టడానికే ఐదు రోజులు దీక్షలు చేపట్టాం
– బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం, అక్టోబర్23(జనంసాక్షి): అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలున్నాయని, అందువల్ల అగ్రిగోల్డ్ ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఇంతకాలం బాధితులకు న్యాయం చేయకపోగా ఆస్తులను తక్కువ చేసి చూపడంపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోందని అన్నారు. బాధితులకు ఉపశమనం లేకపోగా..రాను రానూ మనోధైర్యం కోల్పోతున్నారని బాధ వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు బయటకు రాక ముందు కొంతమంది రాజకీయ నేతలు, వారి బినావిూలపైన కొనుగోలు చేసిన మాట వాస్తవమని చెప్పారు. అందుకే అగ్రిగోల్డ్ ఆస్తుల అసలు విలువ ఎంతో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి హైటెక్ ముఖ్యమంత్రని, ఫిన్‌టెక్ కోసం వచ్చారు కానీ అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినడానికి మాత్రం రాలేదని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేటికి మూడున్నర ఏళ్లు అయినా అతీగతీ లేదని విమర్శించారు.
రిలయన్స్, ఎస్‌ఎల్ గ్రూప్ కంపెనీలు వారి వద్ద అతిచౌకగా కమిషన్‌లను కొట్టే కుట్ర జరగడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ప్రభుత్వ కుట్రను బయట పెట్టడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు నిరసన దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానం ద్వారా సీబీఐ విచారణ కోరతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.