అచ్చొచ్చిన ఇంటికి చేరిన దేవేగౌడ

ఆనాటి ఇంట్లో చేరిన మాజీ ప్రధాని

న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మాజీ ప్రధాని దేవేగౌడ మరోసారి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి ఉత్సాహంగా ఉన్నారు. కర్నాటకలో కుమారుడు సిఎం కావడంతో ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఆయనకూడా దృష్టి సారించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో,అసలు నాటి ఇంట్లోకే మళ్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అదృష్టంగా భావించే ఆ ఇల్లు ఇప్పుడు దేవేగౌడకు కలిసొస్తుందా? అంటే.. అవుననే సంకేతాలు వస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతోనే దేవేగౌడ ఇటీవలే ఢిల్లీకి మకాం మార్చారు. తాను ప్రధాని కాకముందు ఉన్న నివాసంలోకి మరోసారి ఆయన అడుగుపెట్టారు. గత శుక్రవారం ఢిల్లీలోని 5 సఫ్దార్‌జంగ్‌ లేన్‌లోని నివాసంలో దేవేగౌడ గృహ ప్రవేశం చేశారు. 1996లో లోక్‌సభ ఎన్నికల సమయంలో దేవేగౌడ ఈ ఇంట్లోనే ఉండి పోటీ చేశారు. అప్పుడు భారీ విజయం సాధించి.. ప్రధానిగా ఎన్నికయ్యారు ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్‌తోనే తనకు ఈ ఇల్లు కలిసి వస్తుందని భావించి మళ్లీ ఆ నివాసంలోకి అడుగుపెట్టారు దేవేగౌడ. జ్యోతిష్యుల సూచన మేరకు ఇంటిని పునర్నిర్మాణం చేపట్టారు మాజీ ప్రధాని. ఈ ఇంటిని తనకు అదృష్టంగా భావిస్తారు దేవేగౌడ. ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి

కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కర్ణాటక సీఎంగా కొనసాగుతున్నారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని నిర్ణయిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని దేవెగౌడ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం విదితమే. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేశారని, మళ్లీ ఇప్పుడు ఓ మహిళ ప్రధాని అయితే తప్పేంటని ప్రశ్నించారు. ఆ మహిళ మమత, మాయావతిగానీ, ఇంకెవరైనా తప్పులేదని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పాటు కావాల్సిన అవసరముందని చెప్పారు.