అత్యంత భద్రత మధ్య పంచాయితీ ఎన్నికలు

కాశ్మీర్‌లో తొలిదశకు శ్రీకారం

శ్రీనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జమ్ముకాశ్మీర్‌లో మొదటి దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఉదయం 8.00కు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం రెండు గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. కాశ్మీర్‌లో 1,303 పోలింగ్‌ కేంద్రాలు, జమ్ములో 1,993 కేంద్రాలు మొత్తం 3,296 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, కాశ్మీర్‌ డివిజన్‌లో 491, జమ్మూ డివిజన్‌లో 196 మొత్తంగా 687 పోలింగ్‌ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక మైనవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను శనివారం ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కాగా, జమ్ముకాశ్మీర్‌ రాష్టాన్రికి రాజ్యాంగం ద్వారా స్వయం ప్రతిపత్తిని అందించే ఆర్టికల్‌ 35ఎను అమలు చేయాలని కోరుతూ ప్రాంతీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాంతీయ పార్టీలైన సిపిఎం, ఎన్‌సి, పిడిపిలు ఈ ఎన్నికలలో పాల్గనడంలేదు. గత నెలలో జరిగిన మునిసిపల్‌ ఎన్నిలకు కూడా ఈ పార్టీలు దూరంగా ఉన్నాయి.