అత్యంత వెనుకబడిన జాబితాలో పూసల కులస్తులు

వరంగల్‌లో పూసలకుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, స్థలానికి నిధులిస్తా

బ్యాంకుతో లింక్‌ లేకుండా 50వేల రుణాల్లో పూసల గంపకు ప్రాధాన్యత ఇవ్వాలి

పూసలతల్లి ఆత్మగౌరవ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

వరంగల్‌,ఆగస్టు15(జ‌నం సాక్షి)): బీసీలలో కూడా పెద్దకులాలలోని చాలా కులాలకు ఉప కులాలున్నాయని, వాటికి ప్రభుత్వ పథకాలు ఇంకా సమర్థవంతంగా చేరాల్సి ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పూసల కులస్తులు సంచార జాతిగా ఉన్నారని, అత్యంత వెనుకబాటులో ఉన్నారని, వీరిని అత్యంత వెనుకబడిన బీసీ జాబితాలో చేర్చాలని అన్నారు. గతంలో ఉన్న అనేక కులాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్సంపేటలో పూసలతల్లి ఆత్మగౌరవ సభలో శ్రీహరి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పూసల కులస్తులు కోరినట్లు వారికి వరంగల్‌ నగరంలో 300 గజాల స్థలాన్ని సమకూర్చి, అక్కడ కమ్యూనిటీ హాల్‌ నిర్మించుకునేందుకు నిధులు సమకూర్చుతానని హావిూ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్‌లో కూడా ప్రతి కులాని సిఎం కేసిఆర్‌ కమ్యూనిటీ హాల్‌ కోసం స్థలం, నిధులు కేటాయిస్తున్నారని, అదే వరసలో పూసల కులస్తులకు కూడా కమ్యూనిటీ హాల్‌, స్థలం ఇవ్వాలని విజ్ణప్తి చేస్తానన్నారు. పంద్రాగస్టు పండగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ బీసీలకు 50వేలు, లక్ష రూపాయల రుణాలు బ్యాంకులతో సంబంధం లేకుండా ఇవ్వాలని నిర్ణయించారని కడియం శ్రీహరితెలిపారు. ఈ రుణాల్లో పూసల గంపకు ప్రాధాన్యత ఇవ్వాలని తన తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ రుణాలు సమర్థవంతంగా ఉపయోగపడాలంటే పూసలగంపకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పూసల తల్లులు గంపను నెత్తిన పెట్టుకుని ఇప్పటికీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారని, వీరికి బ్యాంకుతో లింక్‌ లేని ఈ రుణాల వల్ల చాలా మేలు జరుగుతుందన్నారు.అన్ని కులాల్లోని ఉప కులాలు, సంచార కులాలకు న్యాయం జరిగే విధంగాచూడాలని తాను బీసీ కమిషన్‌ ను కూడా కోరినట్లు ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సిఎం కేసిఆర్‌ నాయకత్వంలో బీసీలలో అత్యంత వెనుకబడిన వారికి ఆర్ధిక సాయం, రుణం ఇవ్వడానికి వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడానికి అత్యంత వెనుకబడిన బీసీల(ఎంబీసీ) కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అత్యంత వెనుకబడిన వారికి న్యాయం చేయాలన్ని సిఎం సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. పూసల కులస్తులు గతంలో సంచార జాతులుగా ఉండి ఎక్కడెక్కడో ఉండేవారిని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వీరంతా సంఘటితం అవుతున్నారని, వారి శక్తిని ప్రదర్శిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వీరి శక్తిని గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్‌, ఎంబీసీ కార్పోరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, సివిల్‌ సప్లై కార్పోరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

—–