అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు.. నెలకు రూ.3వేల భృతి
– రాష్ట్రంలో 25లక్షల ఓట్లను తొలగించారు
– వారందరినీ చేర్చిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి
– అమరవీరుల ఆత్మ ఘోషించేలా కేసీఆర్ పాలన
– కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్17(జనంసాక్షి ) : తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్, ఓటర్లపై హావిూల వర్షం కురిపించింది. సోమవారం ఉదయం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, గాంధీభవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాట్లాడారు.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, రైతుకు ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఉద్యోగం లభించని నిరుద్యోగికి నెలకు రూ. 3 వేల భృతిని ఇస్తామని చెప్పారు. ఇందిరాపార్కు వద్ద శాశ్వతంగా ధర్నా చౌక్ ను నిర్మిస్తామని, నిరసన తెలపాలని భావించే ప్రజలు శాంతియుతంగా ఇక్కడ ధర్నాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిజిస్టర్ అయిన 19 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని చూపించే
కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వీరిలో తొమ్మిది లక్షల మంది వరకూ ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తున్నారని, నెలకు రూ. 300కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇస్తామని అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మహిళా సంఘాల్లోని 70 లక్షల మంది సభ్యులకు రూ. లక్ష చొప్పున సీడ్ క్యాపిటల్ అందిస్తామని హావిూ ఇచ్చారు. నిరుపేదలకు, వృద్ధులు, వితంతువులకు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఇస్తున్న రూ. 1000 పెన్షన్ ను రూ. 2 వేలకు పెంచుతామని, వికలాంగులకు రూ. 1,500గా ఉన్న పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 65 ఏళ్లు దాటితేనే పెన్షన్ ఇస్తున్నారని, దీన్ని 58 సంవత్సరాలకు తగ్గిస్తామని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ కు వ్యతిరేకులని భావిస్తున్న 25లక్షల మంది ఓట్లను గల్లంతు చేశారని, ఆ ఓట్లన్నీ తిరిగి చేర్చిన తరువాతనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. అమర వీరుల ఆత్మలు ఘోషించేలా కేసీఆర్ పాలన సాగుతోందని, ప్రజలు కేసీఆర్ ను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.