అధికారంలోకి వచ్చిన.. నెలరోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తాం

 

– పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తాం

– 2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం

– గ్రామ సెక్రటేరియట్‌లలో 10మందికి గ్రామంలోనివారికి ఉద్యోగాలిస్తాం

– లంచాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలుచేస్తాం

– పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాం

– ఈ విషయంపై తొలి సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తాం

– రైతులను గిట్టుబాటు ధర కల్పించి భరోసా నిలుస్తాం

– వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి

కడప, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హావిూ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ గురువారం కడపలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.. కమిటీల పేరుతో జాప్యం చేయమని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్‌ చేస్తామని, వ్యవస్థల్లో అవినీతి లేకుండా, పరిపాలనలో పారదర్శక విధానానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా న్యాయవాది జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ… 2008లో వెయ్యి పోస్టులతో మాత్రమే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు వేశారని తెలిపారు. పదేళ్లుగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఊసే లేదన్నారు. రాష్ట్రంలో 5లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కేవలం మొన్న మాత్రమే 240 పోస్టులు చంద్రబాబు వేశారు. ఇది చాలా అన్యాయం. యూనివర్శిటీలో విద్యార్థులకు ఫెలోషిప్‌లు రావడంలేదు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేనందువల్లే రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య వేళ్లూనుకుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అదే విధంగా ఫీజు బకాయిలు రద్దు చేసి, పీహెచ్‌డీ స్కాలర్స్‌కు రూ.5 వేలు, పీజీ విద్యార్థులకు రూ.3వేలు ఇవ్వాలని కోరారు. స్పందించిన జగన్‌ మాట్లాడుతూ.. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులే కాదు.. ఐదేళ్లుగా ఏ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, మేము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ విూద పూర్తి డ్రైవ్‌ చేస్తామని హావిూ ఇచ్చారు. 2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్న అంశంపై లెక్కలు కూడా చూపుతామన్నారు. గ్రామ సెక్రటేరియట్‌లలో 10మంది అదే గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తామని, లంచాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని జగన్‌ స్పష్టం చేశారు. నవరత్నాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా వీరి ద్వారా డోర్‌ డెలివరీ చేస్తామని, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్నారు. ఈ విషయంపై మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తామని జగన్‌ హావిూ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా ఉన్నానని, అనేక సందర్భాల్లో ఈ సమస్యలపై నేను స్పందించానన్నారు. సీపీఎస్‌ విూద ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోగా సీపీఎస్‌ను తొలగిస్తామని జగన్‌ తెలిపారు. చంద్రబాబుకు ఈ విషయంపై చిత్తశుద్ది లేదని, అందుకే కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నాడని జగన్‌ పేర్కొన్నాడు. అదేవిధంగా మార్కెటింగ్‌ పరంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్రలో అనేకసార్లు ప్రస్తావించానని, దళారుల కారణంగా రైతులు నష్టపోతున్నారన్నారు. అదే పంట హెరిటేజ్‌ షాపులోకి వెళ్లే సరికి ధరలు భారీగా ఉంటున్నాయని జగన్‌ విమర్శించారు. పలాస జీడిపప్పే దీనికి ఉదాహరణ అన్నారు. అక్కడి ధరకు, మార్కెట్‌ ధరకు రెట్టింపు తేడా ఉంటోందని, ముఖ్యమంత్రి అనే వ్యక్తి దళారీ వ్యవస్థను కట్టడి చేయాలన్నారు. మన ఖర్మ ఏంటంటే.. మన ముఖ్యమంత్రికి హెరిటేజ్‌ షాపులు ఉన్నాయని, తానే దళారీలకు కెప్టెన్‌ అయ్యాడని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రైతులకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చాయని, చిత్తూరులో తోతాపురి రైతులకు ఇదే జరుగుతుందన్నారు. గల్లా, ఆదికేశవుల కుటుంబాలే.. రైతులనుంచి మామిడిని కొంటున్నాయని, ఇక రైతుకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయని, మేం అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ సవిూక్షిస్తాని జగన్‌ హావిూ ఇచ్చారు.