అనుకున్న సమయానికి..  పోలవరం పనులు పూర్తిచేస్తాం

– స్పిల్‌ వే నిర్మాణం పూర్తి కావచ్చింది
– నవంబరులో గేట్లు అమరుస్తాం
– ఏపీ భారీనీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు
– మంగళవారం క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన మంత్రి
పోలవరం, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అనుకున్న సమయంలోపు పూర్తి చేస్తామని, అత్యంత ముఖ్యమైన స్పిల్‌వే నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబరులో గేట్లు అమరుస్తామని ఆంధప్రదేశ్‌ జవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి పోలవరం పనులను పర్యవేక్షించారు. ఈసందర్భంగా సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పనులు వేగవంతంగా, నాణ్యతగా పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పిల్‌ వే పనుల్లో మరో ఐదు లక్షల క్యూబిక్‌ విూటర్ల కాంక్రీట్‌ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి పూర్తయితే సిద్ధమైనట్టేనని చెప్పారు. 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసేందుకు ముమ్మరంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మరో 5 లక్షల క్యూబిక్‌ విూటర్ల కాంక్రిట్‌ వేస్తే స్పిల్‌వే నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మంత్రి వెంట సీఈ వి.శ్రీధర్‌, నవయుగ కంపెనీ ఎండీ కె.శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు