అన్నపూర్ణగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
నేడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం జగన్
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి వెల్లంపల్లి తదితరులు
విజయవాడ,అక్టోబర్11( జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నారు. సోమవారం రెండు అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అన్నపూర్ణ దేవిగా, మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనం లభించింది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. అమ్మవారి
అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైన అలంకారం. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. మధ్యాహ్నం శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా మహాలక్ష్మీ అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు సీఎం రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖమంత్రి, వెలంపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయంలో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి వస్తారని, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. నిన్న 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ దర్శనం చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మూల నక్షత్రం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సభ్యులు కానరాని పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో భక్తులు పోటెత్తినా ఏం పట్టనట్లుగా పాలకమండలి సభ్యులు రూంలకే పరిమితమయ్యారు. భక్తుల సమస్యలు పట్టించుకోకపోగా తమ వారికి దర్శనం సరిగా అవడం లేదంటూ అధికారులపై వీరంగం చేస్తున్నారు. నగరోత్సవంలో అధికారులతో పాటు పాలకమండలి సభ్యులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత రెండు రోజులుగా పాలకమండలి సభ్యులు ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్న క్రమంలో దర్శనాలు చేపిస్తూ పాలకమండలి సభ్యులు బిజీబిజీగా గడుపుతున్నారు. పాలకమండలి సభ్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవ కాకుండా దర్శనాలకే పరిమితం అవ్వడంతో పాలకమండలి సభ్యులను పోలీసులు లైట్ తీసుకుంటున్నారు.