అన్నా అన్నా ! ఓ రైతన్నా !!

అన్నా ఓ రైతన్నా! అలా నింగిలోకి తొంగితొంగి చూడకు!
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశతో ఎదురు చూడకు!

అన్నా ! ఓ రైతన్నా ! కార్చడానికి కళ్ళలో కన్నీరేలేదని
నిప్పులై దహించే బ్యాంకుల అప్పుల్ని ఆర్పే దారేలేదని
నోటికాడిముద్దలా చేతికందిన పంట దక్కేమార్గమేలేదని
తాకట్టుపెట్టిన ఆలితాలిబొట్టు విడిపించుకొనే ఆశేలేదని
ఇక ఆత్మహత్యే శరణ్యమని ఆవేశపడకురా ఓ రైతన్నా!
పురుగులమందు కోసం పరుగులు పెట్టకురా ఓ రైతన్నా!

నెర్రెలిచ్చిన నేలను,కరువు రక్కసి కరాళనృత్యాన్ని
కలలో కలత నిదురలో సైతం కలవరించకురా రైతన్నా!
పరువు పరువని పగలురేయి పలవరించకురా రైతన్నా!
కరువు వస్తే రానియ్ గుండె చెరువైతే కానియ్, కానీ
నీ ఆత్మవిశ్వాసం మాత్రం సడలనియ్యకురా ఓ రైతన్నా!
నిరాశకు నిర్వేదానికి క్షణికావేశానికి గురికాకురా ఓరైతన్నా!

ఆ ప్రకృతి నీపై నీ పచ్చని పంటలపై పగపట్టిందని
వెక్కివెక్కి ఏడవుకురా ఓ దుక్కిదున్నే  బక్కరైతన్నా
నిరాశతో కుమిలిపోక కృంగిపోక

ఆశేేేే నీ ఆయుధమని

అంధులైన అధికారుల్ని నయవంచకులైన నాయకుల్ని
నమ్మితే బ్రతుకు నరకమని స్వశక్తేయే నీకు స్వర్గమని
ఆవగింజంత ఆశతో కొండల్ని సైతం పిండి చేయవచ్చని
ఆత్మస్థైర్యమే సుఖజీవన సూత్రమని చీకటిలో చిరుదివ్వెని
తెలుసుకోరా రైతన్నా! తెలివిగా బ్రతకరా ఓ రైతన్నా!

ఎందుకు దిగులెందుకు ? ఎవరో వస్తారని ఎదురు
చూడడమెందుకు ? ఆశే శ్వాసగా సాగిపో ముందుకు…

రచన… పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్. – 9110784502