అన్నా హజారే దీక్షను పట్టించుకోని పాలకులు

గతంలోలాగా మద్దతుగా ముందుకు రాని ప్రజలు

ప్రాధాన్యత ఇవ్వని విూడియా ప్రతినిధులు

ముంబై,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): రాజకీయ నేతల అవినీతిపై ప్రశ్నించే లోక్‌పాల్‌ గురించి ఇప్పుడు అంతా మరచిపోయారు. ఇక విూడియా విషయానికి వస్తే అన్నా హజారే తాజాగా చేపట్టిన దీక్షకు కనీసం ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదు. కేవలం తొలిరోజు ఏదో దీక్షకు కూర్చున్నారన్న ధోరణిలో ఓ వార్త ఇచ్చారు. ఆ తరవాత దానికి ప్రాధాన్యం ఇవ్వడానికి వారికి మనసు ఒప్పలేదు. అందుకే కవరేజీలో ప్రాధాన్యం దిగజారింది. లోక్‌పాల్‌, లోకాయుక్త ఏర్పాటుతోపాటు రైతు సమస్యల పరిష్కారం కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బీపీ, షుగర్‌ లెవెల్స్‌ భారీగా పెరిగాయని తెలిపారు. రైతాంగాన్ని గట్టెక్కించేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని హజారే డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు హజారేకు మద్దతుగా స్థానికులు భారీ సంఖ్యలో దీక్షాస్థలికి తరలివచ్చారు. అయినా అన్నా

హజారే దీక్షకు కూర్చున్న పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. అటువైపు వెళ్లడంలేదు. ఓ పెద్దమనిషి పనిలేక అక్కడ కూర్చున్నాడన్న ధోరణి కనిపిస్తోంది. అవినీతిపై సమరం అంటూ నినదించిన నేతలు కూడా అటుఛాయలకు వెళ్లడం లేదు. అవినీతికి మేం వ్యతిరేకం అంటూ అధికారంలోకి వచ్చిన నేతలు కూడా అన్నా గురించి పట్టించుకోవడం లేదు. అటు ప్రజలు, ఇటు నాయకులు కూడా అవినీతిలో భాగమయ్యారా లేక….దానిని తమ నిజజీవితంలో భాగస్వామిని చేసుకున్నారా అన్న బాధ కలుగక మానదు. గతంలో ఓ మారు పోరాడిన అన్నాహజారే మరోమారు.అదే లోక్‌పాల్‌ కోసం తన స్వగ్రామం రాలేగావ్‌ సిద్ది వేదికగా మళ్ళీ నిరవధిక నిరాహారదీక్షకు కూర్చున్నారు. అయితే గతానికి ఇప్పుడు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా పెద్దగా అన్నా దీక్షపై స్పందించడం లేదు. దీక్షతో ప్రభుత్వాన్ని ఎలాగూ కదిలించలేక పోయారు. కనీసం ప్రజలు కూడా కదలడం లేదు. గతంలో మాదిరిగానే ఈ దేశంలో మరో విస్తృతమైన ఉద్యమాన్ని సృష్టించాలన్న బలమైన ఆకాంక్ష అన్నాహజారేలో కనిపించింది. అవినీతిపై సమరం సాగించాలని అనుకున్నారు. మోదీ ప్రభుత్వం అవినీతి నిర్మూలనలో విఫలమైందని గుర్తించారు. ప్రజలు కూడా ఇదే భావిస్తున్నారు. ప్రజల్లో స్పష్టమైన ఆగ్రహం వారి కళ్ళలో కనిపిస్తున్నదని భావించారు. గతంలో హజారే ప్రతి అడుగునూ, మాటనూ విూడియా ఒడిసిపట్టుకుంది. కానీ గతంలో ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు పక్కన పెట్టింది. అందుకే అన్నాహజారే చేపట్టిన దీక్షా శిబిరం వార్తలను కూడా పెద్దగా ప్రచురించడం లేదు. అవినీతి నిర్మూలన జరిగకున్నా,మార్పు మాత్రం కనిపించింది. అన్నా ఉద్యమంతోనే ఎదిగివచ్చి, ఏడాదికాలంలోనే ఎన్నికల రంగంలోకి దూకి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన కేజీవ్రాల్‌ వంటివారు ఇప్పుడు ఆయన పక్కనలేరు. ఆనాడు కదిలిచ్చిన వారూ ఇప్పుడు కానరావడంలేదు. ఆయన ఉద్యమంతో లబ్దిపొందిన వారు ముఖం చాటేశారు. అందుకే తండోపతండాలుగా ప్రజలు రావడం లేదు. లోక్‌పాల్‌ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని వేగంగా కదిలించగలుగుతానని హజారే భావించినా.. అందుకు అనుగుణంగా పరిస్థితులు లేవు. మోడీ కూడా అవినీతిని అంతమొందించలేమని గుర్తించారు. అందుకే ఆయన తన పార్టీని ఎలా విస్తరించాలన్నదానిపై బిజీగా ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ, నాటి జన సందోహం, విూడియా ప్రతినిధుల హడావుడి, టెలివిజన్‌ చానెళ్ళ ప్రత్యక్ష ప్రసారాలు ఇప్పుడు లేవు. అన్నా ముందున్న వారి పదులకు మించి ఉండడం లేదు. అప్పట్లో మాదిరిగా ఒక ఉద్యమ ఊపు మాత్రం కానరావడం రాలేదన్నది నిజం. ప్రజలు తలచుకుంటే ఇది అసాధ్యమేవిూ కాదు. కానీ ప్రజలు కూడా బిజీ అయిపోయారు. లోక్‌పాల్‌ను నియమించాలంటే పాలకులకు ఎంతో ధైర్యం ఉండాలి. ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిత్యమూ డేగకళ్ళతో తమను పరీక్షించే, పర్యవేక్షించే వ్యవస్థలను సృష్టించడానికి పాలకులు అంగీకరించరు. అందుకే అన్నా హజారే ఉద్యమానికి పాలకుల నుంచి మద్దతు రావడం లేదు.