అన్ని గ్రామాల్లో సరుకుల పంపిణీ

– వీలైనంత వేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ జరగాలి
– ఏపీ మంత్రి నారా లోకేష్‌
– మందసలో పర్యటించిన లోకేష్‌
– సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి
శ్రీకాకుళం, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తితలీ తుఫాను ప్రభావిత అన్ని గ్రామాల్లో సరుకుల పంపిణీ జరగాలని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ అధికారులకు సూచించారు. తితలీ తుఫాను ప్రభావంతో విలవిల్లాడిన మందస గ్రామంలో మంత్రి నారా లోకేష్‌ సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తుఫాను బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేషన్‌షాపుల్లో ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తామన్నారు. తక్షణమే అన్ని గ్రామాల్లో సరుకుల పంపిణీ పూర్తవ్వాలని అధికారులను లోకేష్‌ ఆదేశించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజన సదుపాయం కల్పించాలని చెప్పిన మంత్రి గ్రామాల్లో నిరంతరం తాగునీరు సరఫరా కొనసాగాలే చూడాలని సూచనలు చేశారు. వీలైనంత వేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ వేగంగా జరగాలని అధికారులను మంత్రి లోకేష్‌ ఆదేశించారు. అదేవిధంగా తుఫాన్‌ ప్రభావంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండాఅ ధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ చెత్తలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని, బ్లీచింగ్‌ చల్లి, దోమల నివారణకు ఫాగింగ్‌ చేసి స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.  ఇదిలా ఉంటే తితలీ తుఫాను కారణంగా పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో టార్పాన్లు పంపిణీ చేస్తున్నారు. ఉపాధి హావిూ పథకం ద్వారా పొలాల్లో పడిపోయిన కొబ్బరి చెట్లు తొలగింపు పక్రియ జరుగుతోంది. గ్రామాల్లో పలు శాఖలకు చెందిన సిబ్బంది నిరంతరం పర్యటిస్తున్నారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పంట నష్టంపై అంచనా వేస్తున్నారు.

తాజావార్తలు