అఫ్ఘాన్‌ పునర్నిర్మాణంలో కీలక భూమిక

ట్రంప్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్‌
న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో భారత్‌ ఎటువంటి ప్రయోజనం చేకూరని గ్రంథాలయం ఏర్పాటు కోసం నిధులు సమకూరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అఫ్గాన్‌ పునర్‌ నిర్మాణం కోసం భారత్‌ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపాయి. సామాజికపరంగా, ఆర్థిక పరంగా, అక్కడి ప్రజలకు సురక్షితమైన జీవనాన్ని అందించేందుకు, జీవనోపాధిని ప్రోత్సహించేందుకు భారత్‌ కృషి చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని దేశాలు
అఫ్గాన్‌లో శాంతి స్థాపనకు, పునర్‌ నిర్మాణానికి కొద్దిగా సాయం చేసి ఎంతో చేసినట్లు చెప్పుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రధాని మోదీని ఉదాహరణగా చూపించిన విషయం తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. కానీ అఫ్గానిస్థాన్‌లో 218 కిలోవిూటర్ల పొడవైన రహదారినిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టులకు భారత్‌ నిధులు సమకూరుస్తోంది. దీనితో పాటు సల్మా డ్యాం, అఫ్గాన్‌ కొత్త పార్లమెంటు భవనం కోసం కూడా భారత్‌ పెట్టుబడులు పెడుతోంది. అంతేకాకుండా ఆ దేశ సైన్యానికి కావాల్సిన ఆయుధసంపత్తిని అందిస్తోంది. వందలాది మంది అఫ్గాన్‌ భధ్రతా సిబ్బందికి శిక్షణ ఇస్తోంది’ అని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అఫ్గాన్‌లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిధులు సమకూరుస్తున్నామని మోదీ నాతో చెప్పారు. కానీ యుద్ధ వాతావరణం ఉన్న అటువంటి ప్రదేశంలో గ్రంథాలయం వల్ల ప్రయోజనమేంటి? దాన్ని అసలు ఎవరు ఉపయోగిస్తారు’ అంటూ ట్రంప్‌ మోదీపై విమర్శలు గుప్పించారు.