అబద్దాలు చెప్పడంలో..  ట్రంప్‌, మోదీలు ఒక్కటే


– ట్విట్టర్‌లో బీఎస్పీ చీఫ్‌ మాయావతి
న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చుతూ బీఎస్పీ చీఫ్‌ మాయావతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అబద్ధాలు చెప్పడంలో ఈ ఇద్దరూ ఒక్కటేనని అర్థం వచ్చేలా శనివారం ట్వీట్‌ చేశారు. అమెరికా విూడియాలో ప్రచురితమైన ఓ వార్తను ఉటంకిస్తూ… ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 800 రోజుల్లో 10 వేలకు పైగా అబద్ధాలు చెప్పారంటూ.. ఫ్యాక్ట్‌ చెకర్‌ డేటా అధారంగా వాషింగ్టన్‌ దినపత్రిక వెల్లడించింది. అమెరికా విూడియా చాలా అప్రమత్తంగా ఉంటుంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి విూ అభిప్రాయం ఏమిటని మాయావతి ట్వీట్‌ చేశారు. 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘అచ్చే దిన్‌’ (మంచి రోజులు) రాబోతున్నాయంటూ బీజేపీ విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హావిూని కొట్టిపారేసిన ప్రతిపక్షాలు.. ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ దుయ్యబట్టాయి. ప్రధాని మోదీని గట్టిగా నిలదీస్తున్ననేతల్లో మాయావతి ముందు వరుసలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నిలువరించేందుకు ఆమె తన ప్రత్యర్థి పక్షం సమాజ్‌వాదీ పార్టీతో సైతం చేతులు కలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించడంతో… ఎస్పీ-బీఎస్పీ పార్టీలు జతకట్టక తప్పలేదు. కాగా గతంలో అమెరికాలో ఎన్నికల జరిగినప్పుడు కూడా ప్రధానమంత్రి మోదీ పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీచేసిన డొనాల్డ్‌ ట్రంప్‌… ‘అబ్కీ బార్‌ మోదీ సర్కార్‌’ అంటూ బీజేపీ నినాదాన్ని అందుకుని ఇండియన్‌-అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత ఇరువురు నేతలు కలిసి పలు కార్యక్రమాల్లో తమ ఆలింగనాలు, షేక్‌హ్యాండ్లతో తమ స్నేహాన్ని చాటుకున్నారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.