అభివృద్ధికి సూచిక..
` హైదరాబాద్‌లో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
` బెంగుళూరు,కోల్‌కతాను దాటి ముందంజలో నగరం
హైదరాబాద్(జనంసాక్షి):విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అవసరాలు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. కంపెనీల రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో నగరం వైపు వలసలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్నది. ఈ విస్తరణకు అనుగుణంగా ఏర్పడుతున్న మౌలిక సదుపాయాల డిమాండ్‌లో విద్యుత్తు రంగం అగ్రభాగాన నిలుస్తున్నది. మరో మూడేండ్లలో దేశంలోనే అత్యధిక విద్యుత్తును వినియోగిస్తున్న నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించవచ్చని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడైంది. దేశంలోని 45 నగరాల్లో ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ఠ డిమాండ్, భవిష్యత్తులో వచ్చే గరిష్ఠ డిమాండ్, వినియోగం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ సర్వే ఇచ్చిన 19వ నివేదికలో టాప్‌లో ఉన్న 20 నగరాలలో ఆగ్రా, ఔరంగాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పుణె, రాంచీ, సూరత్, వారణాసి విశాఖపట్నం లాంటివి ఉన్నాయి. ఒక్క ఢల్లీి తప్ప దేశంలోని ముఖ్యమైన నగరాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నగరాలన్నింటిలో భవిష్యత్తులో ఏర్పడనున్న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ (మెగావాట్లలో), వినియోగం (మిలియన్ యూనిట్లలో) అంచనాలను పరిశీలిస్తే హైదరాబాద్ టాప్ గేర్‌లో దూసుకుపోతున్నట్టు తెలుస్తున్నదివిద్యుత్తు వినియోగంలో కూడా హైదరాబాద్ వేగంగా దూసుకుపోతున్నదని ఆ సర్వే నివేదిక పేర్కొంది. విద్యుత్తు వినియోగంలో 2019`20లో ముంబై కన్నా స్వల్పంగా వెనుకబడిన హైదరాబాద్.. బెంగళూరు, కోల్‌కతా కంటే మాత్రం ముందంజలో ఉన్నది. 2020`21లో ముంబైని కూడా దాటేసింది. 2029`30 నాటికి హైదరాబాద్‌లో సగటున 39,267 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటుందని, ముంబై, కోల్‌కతా వంటి మహానగరాలు దీని దరిదాపులకు కూడా వచ్చే అవకాశం లేదని ఆ నివేదిక అంచనా వేసింది. హైదరాబాద్‌తో పోటీ పడుతున్న బెంగళూరులో 20 వేల మిలియన్ యూనిట్లు కూడా దాటకపోవచ్చని పేర్కొంది. దశాబ్దకాలంలో హైదరాబాద్‌లో దాదాపు 80.1 శాతం (17468 మిలియన్ యూనిట్లు) మేర విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశాలున్నట్టు ఈ సర్వే తేల్చిచెప్పింది. ముంబైలో 25.84 శాతం (5680 మి. యూనిట్లు), బెంగళూరులో 31.33 శాతం (4695 మి. యూనిట్లు), కోల్‌కతాలో 40.55 శాతం (7888 మి.యూనిట్లు) మేర వినియోగం పెరిగే అవకాశం ఉన్నట్టుగా సర్వేలోని గణాంకాలు అంచనావేశాయి. దేశంలో ఇప్పుడు విద్యుత్తు రంగం అంటే అందరూ తెలంగాణ వైపు చూసే పరిస్థితి నెలకొన్నది. ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్తు ఇవ్వడం లేదు ఒక్క తెలంగాణలో తప్ప. రాష్ట్రం ఏర్పడిన కేవలం ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించడం ద్వారా నెలకొల్పిన నమ్మకం.. ఏటికేడాది మరింత బలపడుతున్నది. దీంతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు భారీగా తరలి వస్తున్నాయి. ప్రతి ఏటా వేల సంఖ్యలో వినియోగదారులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో అటు గరిష్ఠ విద్యుత్తు డిమాండ్.. ఇటు వినియోగంకూడా రాకెట్ వేగంతో పెరుగుతున్నది.