అభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

 

నిధుల కొరత ఉన్నా ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నాం

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టారు

గుంటూరు జిల్లాలో అభివృద్ది కార్యక్రమాల్లో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

గుంటూరు,జనవరి28(జ‌నంసాక్షి): అభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌

పేర్కొన్నారు. రాష్ట్రం నిధుల కొరతలో ఉండి కూడా ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపిస్తుందని చెప్పారు. అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదన్నారు. ముపాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో సోమవారం సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.70 లక్షల నిధులతో నిర్మించిన పలు సీసీ రోడ్లను, అంగన్వాడీ భవనాలను, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి కోడెల మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటి వరకూ రూ.20 కోట్ల 95 లక్షల 54 వేల రూపాయలతో అభివృద్ధి జరిగిందనీ, ఇంకా చేస్తామని అన్నారు. అప్పటి ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అప్పులు చేశాయని, ఆంధ్రప్రదేశ్‌ ఆస్తులను తెలంగాణకు ఇచ్చారని విమర్శించారు. ఫించన్లు వెయ్యి నుంచి రెండు వేలు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని, డ్వాక్రా మహిళల విషయంలో ప్రతి ఆడ బిడ్డ సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం పసుపు కుంకుమ క్రింద రూ.10 వేలు ఇస్తుందని తెలిపారు. ఆ డబ్బును వృత్తి వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టుకొని ప్రతి మహిళ తమ కుటుంబం నెలకు పదివేలు చొప్పున సంపాదించుకొని, కుటుంబ పోషణ చేసుకోనే విధంగా ప్రభుత్వం తోడ్పాటునిస్తుందన్నారు. ఆడవారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలనే కృత నిశ్చయంతో మొట్ట మొదటి సారిగా సతైనపల్లి నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామన్నారు. సాగర్‌లో సరిపడినన్ని నీళ్ళు లేకపోవడం వల్ల రైతులు దాళ్వాలో వరి సాగుకు సరిపడ నీళ్ళులేవని వరి సాగు చేయవద్దని చెప్పి, ప్రత్యామ్నాయంగా శనగ లేదా ఇతరత్రా రకాలైన అపరాలు సాగు చేసుకోవాలని సూచించారు. త్వరలో మిగిలిన విడతల రైతు రుణమాఫీ అందజేసి లక్షన్నర రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా రైతు ప్రభుత్వం అనీ నిరూపిస్తామని సభాపతి కోడెల శివప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ టిడిపి సీనియర్‌ నాయకులు శిరిగిరి వెంకట్రావు, ఎంపిపి సిహెచ్‌ ఉమా దేవి, మండల పార్టీ అధ్యక్షుడు నలమోతు పాపారావు, ఎంపిడిఒ ఉషారాణి, ఎమార్వో ఆర్‌.యశోద, ఎఒ సుజాత, అంగన్వాడీ సూపర్‌వైజర్‌ అనంతలక్ష్మీ, నాయకులు శిరిగిరి శ్రీనివాసరావు, దాసరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.