అమరావతిపై శ్రీవారి ఆశీస్సులున్నాయి

– రాజధానిలో శ్రీవారి ఆలయనిర్మాణం ఒక చరిత్ర
– ఏడుకొండలవాడు ఏపీలో ఉండటం మనందరి అదృష్టం
–  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
– రాజధానిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం
అమరావతి,జనవరి31(జ‌నంసాక్షి): ఏపీ నూతన రాజధాని అమరావతిపై శ్రీవారి ఆశీస్సులున్నాయని, ఆయన ఆశీస్సులతోనే స్వయం కృషితో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏపీ సీఎం చేతుల విూదుగా
ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ, బీజావాపనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మాణం ఒక చరిత్ర అని అన్నారు.  వేంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమన్నారు. వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం అమరావతిలో రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమరావతి రెండుసార్లు రాజధానిగా నిలబడిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పవిత్రమైన మట్టి, జలాలు తీసుకొచ్చి ఈ నేలలో పునీతం చేశామన్నారు. తిరుపతి, తిరుమల నుంచే కాకుండా ఇక్కడ కూడా ప్రజలకు ఆశీర్వాదం అందడం శుభకరమన్నారు. శ్రీవేంకటేశ్వరుడు మా ఇంటి కుల దైవమని చంద్రబాబు పేర్కొన్నారు. అలిపిరి ఘటనలో శ్రీవారి దయాతోనే ఆ రోజు బతికానని.. నాచేతుల విూదుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని రాసిపెట్టి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. టీటీడీ నిర్మించే ఆలయానికి 25 ఎకరాలు భూమిని ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు అమరావతిపై ఉండాలి.. కష్టపడి పని చేసే వారికి దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని వేడుకున్నారు. ఎన్ని సార్లు వెళ్లినా తిరుమల మళ్లీ వెళ్లాలనిపిస్తోందన్న సీఎం.. దేశంలోని అన్ని రాజధానిల్లో, అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు కట్టాలని టీటీడీని కోరారు. మరోవైపు ఉచితంగా భూమి ఇస్తే దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించవచ్చని తెలిపారు. రాష్ట్ర విభజనతో అన్ని పోయినా… తిరుమల శ్రీవారు ఉన్నారన్న ధైర్యంతో ముందుకు వెళ్లానని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో సంఘ్వాల్‌, మంత్రులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.