అమరావతిలో ఐటి జోన్‌కు ప్రాధాన్యం

ఇంజనీరింగ్‌ కాలేజీలతో ఐటి కంపెనీల టై అప్‌
మెల్లగా క్యూ కడుతున్న కంపెనీలు
అమరావతి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అమరావతి కేంద్రంగా హైదరాబాద్‌ తరహాలో ఐటి జోన్‌ ఏర్పాటు చేయాలన్న సిఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అమరావతి నిర్మాణంలో ఇది ఓ భాగం కానుంది. ఐటి కారిడార్‌ అభివృద్దితో అనేక కంపెనీలను ఇక్కడికి కూడా రప్పించేలా చూస్తున్నారు. ఐటిశాఖ మంత్రి లోకేశ్‌ చొరవతో అనేక కంపెనీలు ఇక్కడ తమ క్యాంపస్‌లను ఏర్పాటుచేయబోతున్నాయి. రానున్నకాలంలో ఇక్కడ ఐటి హబ్‌ ప్రతేక స్థానం ఆక్రమించబోతున్నది.  పలు కంపెనీలు తమ కార్యకలాపాలను సాగించేందుకు ముందుకు వచ్చేలా బాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్‌ సెంటర్‌ స్థాపన సాధ్యాసాధ్యాలపై ఆ సంస్థ వైస్‌ప్రెసిడెంట్‌ టెల్లర్‌ హాస్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో గతంలోనే చర్చించారు.  మైక్రోసాఫ్ట సిఇవో సత్యనాదెళ్ల సూచన మేరకు వీరంతా ఇక్కడికి వచ్చి బాబుతో చర్చలు జరిపారు. అమరావతిలో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ  నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధి బృందం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఉన్న ఆ వర్సిటీలో ఐటీ అభివృద్ధికి అవసరమైన వసతులను మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతోకూడిన బృందం పరిశీలించింది. దీంతో ఈ ప్రాంతంలో మెల్లగా స్టార్టప్‌ కంపెనీల లాగా ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉంది. ఇక్కడి ఇంజనీరింగ్‌ కళాశాలలతో ఆయా కంపెనీలను టై అప్‌ చేయించడం ద్వారా నిరుద్యో సమస్యకు చెక్‌ పెట్టాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇకపోతే ఇటీవల హెచ్‌సిఎల్‌ కూడా తమ సంస్థకు ఇక్కడ పునాది వేసింది. అలాగే అనేక సంస్థలు ఇప్పటికే క్యూ కట్టాయి. ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి.  రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. లక్ష్యం-2018 పేరుతో
22 అంశాలతో ఒక బ్లూప్రింట్‌ సిద్ధం చేసింది. రాజధానిలో మౌలిక వసతులన్నీ వచ్చే మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. మౌలిక వసతుల కల్పనకు రూ.32,463 కోట్లు అవసరమని కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అంచనా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై సవిూక్షా సమావేశం నిర్వహించి మెకిన్సే సంస్థ ఇచ్చిన నివేదికపైనా, వనరులు ఎక్కడి నుంచి సవిూకరించాలన్న అంశంపైనా తర్జనభర్జన పడుతున్నారు.   తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థలు ఏమున్నాయో గుర్తించి, వాటి నుంచి రుణాలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధానిలో సీఆర్‌డీఏకి వచ్చే భూమిలో 4 వేల ఎకరాల్ని ఏ సంస్థలకూ కేటాయించకుండా ఉంచాలని, దాన్ని హావిూగా ఉంచి రుణాలు తీసుకోవాలని నిర్ణయించారు. రాజధానిలో భూముల విలువలు పెరిగాక… ఆ భూమిని విక్రయించి, రుణం తీర్చేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. రాజధానిలో అవసరమైన మౌలిక వసతులన్నీ రాబోయే 7-8 ఏళ్లలో దశలవారీగా పూర్తి చేయాలని సీఆర్‌డీఏ మొదట భావించింది. వచ్చే మూడేళ్లలో రూ.18 వేల నుంచి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. మొత్తంగా రాజధాని నిర్మాణంతో పాటే ఆయా ఐటి సంస్థలుముందుకు వస్తే వాటికి భూములు కేటాయించడం ద్వారా సంస్థల ఏర్పాటుకు తోడ్పడాలన్నది సర్కార్‌ వ్యూహంగా ఉంది. దీంతో యూత్‌కు అవకాశాలు రాగలవని భావిస్తున్నారు.