అమరావతిలో శ్రీవారి దర్శనం

ఆలయ నిర్మాణానికి టిటిడి నిర్ణయం

నేడు ముఖ్యమంత్రిచే శంకుస్థాపన

అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): తిరుమల దేవస్తానం వారు మరో మహత్కార్యానికి నడుం బిగించారు. రాజధాని అమరావతిలో కృష్ణానదీ తీరాన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అధునాతన శ్రీవారి ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 31న గురువారం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల లోపు ముహుర్తం ఖరారైంది. వెంకటపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన నదీ తీరాన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయ నిర్మాణం జరగబోతోంది. శంకుస్థాపనకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రారంభించారు. సీఎం రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పోలీస్‌లు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఐదెకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు. ముందుగా టీటీడీ రూ.135 కోట్లు ఇందుకు ఖర్చు చేస్తోంది. మిగిలిన 20 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎలా ఉంటుందో, అదేరీతిలో ఏ మాత్రం తీసిపోకుండా ఆలయ నిర్మాణం జరగనుంది .నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు, ప్రధాన ద్వారం వద్ద మరో గాలి గోపురం, ఆలయ శిఖరం నిర్మాణం చేస్తారు. ఆలయం పూర్తిగా అభివృద్ధి చేయడానికి రూ.400 కోట్లు ఖర్చు కాగలదని టీటీడీ అంచనా వేసింది.