అమర్‌నాథ్‌లో 8 మంది యాత్రికుల మృతి

41కి చేరిన మృతుల సంఖ్య

జమ్మూ,జూలై15(జనంసాక్షి): కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్రలో గడచిన 36 గంటల్లో 8 మంది యాత్రికులు సహజ కారణాల వల్ల మరణించారు. దీంతో ఈ ఏడాది అమరనాథ్‌ యాత్రలో యాత్రికుల మరణాల సంఖ్య 41కి చేరుకుందని అధికారులు తెలిపారు.గత వారం దక్షిణ కాశ్మీర్‌ హిమాలయాల్లోని గుహ పుణ్యక్షేత్రం సవిూపంలో క్లౌడ్‌బర్ట్స్‌ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో 15 మంది యాత్రికులు మరణించారు.మరణించిన 8 మంది యాత్రికులను రాజస్థాన్‌కు చెందిన మోంగిలాల్‌ (52), గుజరాత్‌కు చెందిన వ్రియాగ్‌ లాల్‌ హీరా చంద్‌ వ్యాస్‌ (57), కర్ణాటకకు చెందిన బసవరాజు (68), సింగపూర్‌కు చెందిన పూనియామూర్తి (63), మహారాష్ట్రకు చెందిన కిరణ్‌ చతుర్వేది, కలవాల సుబ్రమణ్యం (63)లుగా గుర్తించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోవింద్‌ శరణ్‌ (34), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్వీర్‌ సింగ్‌ (70) లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30వతేదీన ప్రారంభమైంది. అయితే జులై 8న ఆకస్మిక వరదల కారణంగా తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు.జులై 11న అమరనాథ్‌ యాత్ర తిరిగి ప్రారంభమైంది.