అమాయక ఆదివాసీలను చంపి ఎన్‌కౌంటర్ అంటే ఎలా ?
ఆయుధాలు లేనివారిని చంపరాదన్న
ప్రాథమిక సూత్రాలను పాటించలేదు
మైనర్లను, మహిళలను బలితీసుకున్నారు
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై విచారణకు
కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్ డిమాండ్
న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి):
అటవీ ప్రాంతంలో గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం నాడు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు, గిరిజనుల స్ధితిగతులపై ఆయన అధినేత్రితో చర్చించారు. అనంతరం కిశోర్ చంద్రదేవ్ విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య అమాయక గిరిజనులు నలిగిపోతున్నారని, ఒక్కోసారి బలవుతున్నారని ఆయూధాలు లేనివారిని చంపరా దన్న ప్రాథమిక సూత్రాలను ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో పాటిించలేదని, మైనర్లను మహిళలను బలితీసుకున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ లాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా సమాజానికి మంచిది కాదన్నారు. ఛత్తీస్‌గఢ్ ఘటనలోపోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనలో అమాయకులు, మైనర్‌లు మరణించారన్నారు. చీకట్లో గుడ్డిగా కాల్పులు జరిపి మైనర్‌లను చంసి ఎన్‌కౌంటర్ అంటే ఎలా అని ప్రశ్నించారు. నైట్‌విజన్ పరికరాలు లేకుండా ఎలా కాల్పులు జరిపారని ప్రశ్నించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు ఉన్నాయని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చంద్రదేవ్ డిమాండ్ చేశారు. అమాయకులైన యువకులు, చిన్నా పిల్లలను ఎన్‌కౌంటర్ పేరిట చంపడం దారుణమని ఆయన అన్నారు. ఈ ఎన్‌కౌంటర్లను సమర్ధించలేమని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి రాష్ట్ర నాయకత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు ఆశాజనకంగా లేవని అన్నారు. పార్టీ పునరుజ్జీవానికి కాయకల్ప చికిత్స అవసరమని కిశోర్ చంద్రదేవ్ అన్నారు.