అయోధ్యలో మరోమారు ఉద్రిక్తత

భార్యతో కలసి చేరుకున్న ఉద్దవ్‌ థాకరే

అయోధ్య,నవంబర్‌24(జ‌నంసాక్షి): అయోధ్యలో ఓ వైపు ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి సమావేవాలకు

అనుమతి లేకుండా 144 సెక్షన్‌ విధించారు. ఈ దశలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే తన సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్యతో కలిసి శనివారం అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జై శ్రీరాం నినాదాతో శివసేన కార్యకర్తలు, ఇతర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన భారీ కాన్వాయ్‌తో లక్ష్మీ ఫోర్ట్‌కు పయనమయ్యారు. కాగా శివసేన చీఫ్‌ కంటే ముందే రెండు రైళ్లలో ఆ పార్టీ కార్యకర్తలు అయోధ్యకు తరలి వచ్చారు. వారంతా తొలుత సరయూ నదిలో స్నానమాచరించి అనంతరం రామ్‌ లల్లా, హనుమాన్‌గిరిలో పూజలు నిర్వహించారు. కాగా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయోధ్య నగరంతో సెక్షన్‌ 144 అమలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఉద్ధవ్‌ థాకరే స్థానిక పార్టీ నేతలు, సాధువులు, సంతులతో కలిసి రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. కాగా శివసేన చీఫ్‌ రేపు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి యూపీలోని యోగి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. కాగా తన అయోధ్య పర్యటన సందర్భంగా ఉద్ధవ్‌ థాకరే ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన శివనేరి కోట నుంచి ఓ కలశంలో మట్టిని తీసుకుని వచ్చారు. మహారాష్ట్ర నుంచి 4 వేల మంది శివసైనికులతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రెండు రోజుల ముందే చేరుకోవడం విశేషం. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటూ ఆయన ఇటీవల డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.