అయ్యప్ప భక్తులపై పోలీసుల ప్రతాపంపై హైకోర్టు సీరియస్‌

శాంతిభద్రతల పేరుతో అతిగా వ్యవహరించొద్దని సూచన

తిరువనంతపురం,నవంబర్‌23(జ‌నంసాక్షి): అయ్యప్ప భక్తుల పట్ల అతిగా వ్వయహరించరాదని కేరళ హైకోర్టు పోలీసులకు గట్టిగా హెచ్చిరించింది. పోలీసులు భక్తులపై కఠినంగా ప్రవర్తించొద్దని, అధికంగా చర్యలకు దిగొద్దని కోర్టు వెల్లడించింది. అయ్యప్ప కీర్తనలపై, బృందాలుగా వెళ్లే భక్తులపై ఆంక్షలు విధించొద్దని తెలిపింది. అలాగే ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు కాపాడాలని చెప్పింది. ఆందోళనకారులను అడ్డుకుని భక్తులు యాత్ర సజావుగా చేసుకునేలా చూడడం పోలీసుల బాధ్యత అని కోర్టు పేర్కొంది. శబరిమలకు భక్తులు బృందంగా వస్తారని, అయ్యప్ప కీర్తనలు పాడుకుంటూ ఆలయానికి వెళ్తుంటారని, అది కూడా వారి తీర్థయాత్రలో భాగమని.. దానిపై ఆంక్షలు విధించడానికి వీల్లేదని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. భక్తులు కీర్తనలు పాడొద్దు, గుంపులుగా వెళ్లొద్దు అంటూ నిబంధనలు పెట్టొద్దని ఆదేశించింది. సాధారణంగా భక్తులు ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ పాదయాత్రగా శబరిమల కొండను ఎక్కుతుంటారు. అయితే శబరిమలలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో నవంబరు 15 నుంచి సెక్షన్‌ 144 అమలులో ఉంది. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, శరణుఘోష చేయొద్దని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ పలువురు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆలయ పరిసరాల్లో సెక్షన్‌ 144 ఎత్తేయమని కోర్టు ఆదేశించలేదు.కాగా తాము గుంపులు గుంపులుగా ఉంటున్న ఆందోళనకారులను మాత్రమే అడ్డుకుంటున్నామని రాష్ట్ర పోలీస్‌ చీఫ్‌ కోర్టులో తెలిపారు. భక్తులను అడ్డుకోవడం లేదని సమాధానమిచ్చారు. అలాగే ఆందోళన చేస్తున్న వారినే ఆపుతున్నామని, సాధారణ భక్తులను ఏవిూ అనట్లేదని వెల్లడించారు. పది నుంచి యాభై ఏళ్ల లోపు మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.