అర్థరాత్రిళ్లు ఇసుక తవ్వకాలు?

ఏలూరు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  రీచ్‌లకు రాత్రిపూట గుట్టుచప్పుడుకాకుండా ఇసుక రవాణా వాహనాలు వెళుతున్నాయని తెలుస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.  వీరు యంత్రాలను వినియోగించి కాకుండా కూలీల ద్వారా ఇసుకను తవ్వుతున్నారు. ప్రధాన రహదారి నుంచి
తిరిగి ఈ లారీ నిర్దేశిత ప్రాంతంలో ఇసుకను తిరిగి డంప్‌ చేసేవరకూ అడుగడుగునా ఇసుక మాఫీయా తమ మనషులను నియమిస్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడానికి వెనుకాడని రీతిలో ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇసుక తరలింపు కళ్లకు కనపడుతున్నా దీనిని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇలా తరలించిన ఇసుకను వీరు నిడదవోలు వార్పురోడ్డు, శెట్టిపేట జంక్షన్‌,
నవాబుపాలె, ప్రత్తిపాడు, తాడేపల్లిగూడెం రోడ్డుల్లో వేస్తున్నారు. ఈ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే గతంలో తాము తవ్వి తీసుకొచ్చామని తమ భవనాల నిర్మాణానికి వాడుకుంటున్నామని చెబుతున్నారు. ఇదంతా అధికారులకు స్పష్టంగా కనిపిస్తున్నా నోరు మెదపడం లేదు. ఇక మెట్టప్రాంతం, ఏజెన్సీ పరిధిలోని వాగులను కూడా అక్రమార్కులు వదలి పెట్టడం లేదు. ఈ దశలో అనధికారికంగా అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక భారీ ఎత్తున తరలించుకు పోతున్నారు. ప్రధానంగా గోదావరిని ఆనుకుని ఉన్న నిడదవోలు పరిధిలోని నిడదవోలు, పందలపర్రు, తీపర్రు ఇసుక రీచ్‌లు, ఆచంట నియోజకవర్గం పరిధిలోని రేవులు రాత్రిపూట అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిపోయాయి. ప్రతీరోజూ వందల టన్నుల ఇసుక బహిరంగ మార్కెట్‌కు తరలించుకుపోతున్నారు.  ఇక్కడ నియంత్రణ అనేది లేకపోవడంతో అక్రమార్కులు ఆడింది ఆటగా, పాడిందిపాటగా మారింది. జిల్లావ్యాప్తంగా ఇలా రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోతున్న ఇసుక సుమారు రోజుకు 200 లారీల వరకూ ఉంటుందని అంచనా.  దీనివల్ల నదీగర్భం కూడా ధ్వంసం అవుతోంది.  గోదావరిలో అక్రమ ఇసుక తవ్వకాల్లో తమ దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత అధికారులకు తెలియ జేస్తున్నామని స్థానిక అధికారులు అన్నారు.