అర్ధరహిత ఆరోపణలు మానుకోవాలి

విజయవాడ : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయడు బాధిత ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ బాధితులకు బియ్యం, మంచినీరు అందేలా చూస్తున్నా బాబు విమర్శించడం తగదని హితవు పలికారు విజయవాడ సమీపాన ఉప్పులూరు వద్ద నీట మునిగిన పంటలను పరిశీలించేందుకు మంగళవారం ఆయన ఇక్కడకు వచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వదరబాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 170 పునరావాస కేంద్రాలను నెలకొల్పి సుమారు 68 వేల మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. ఇక రుతుపవనాలను గుర్తించే వ్యవస్థ వాతావరణ శాఖ వద్ద లేదని ఆ శాఖాధికారులు ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారని తెలిపారు. వరదనీటిలో 5.25 లక్షల ఎకరాలున్నాయని, నీరు తొలగిపోయాక పంట నష్టం అంచనా వేస్తామని చెప్పారు. రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.