అర్హులైన పేదలకు రేషన్ కార్డులు
కసరత్తు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం
జనగామ,ఆగస్ట్8(జనం సాక్షి): అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులు అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కార్డులు కావాల్సిన వారు ఓ వైపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటుండగా, వెనువెంటనే రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్లి విచారణ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్తకార్డులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెరిగిన కుటుంబాలకనుగుణంగా వీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.కార్డుల ఎంపిక విధానాన్ని స్థానిక తహసీల్దార్లకు అప్పగించగా, వారి పేర్లను డీసీఎస్‌వోకు పంపించారు. జిల్లాలోని 13 మండలాలతో పాటు జనగామ మున్సిపాలిటీని కలుపుకుని 355 రేషన్‌షాపులున్నాయి. వీటి పరిదిలో 1,62,847 రేషన్ కార్డులు ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకుతోడు ఉమ్మడి కుటుంబాల నుంచి వేర్వేరుగా స్థిరపడిన వారు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 13,956 మంది కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డులను ఆగస్టు 15 నుంచి అందించనున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలిస్తున్నారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపి క చేసే బాధ్యత జిల్లా పౌరసరఫరాల శాఖకే అప్పగించారు. మండల రెవెన్యూ అధికారులు గ్రామ స్థాయిలో పరిశీలించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో జిల్లా అధికారులకు పంపిస్తున్నారు. అన్ని వివరాలను పరిశీలించిన అ నంతరం లబ్దిదారులను ఎంపిక చేసే పక్రియను పౌరసరఫరాల శాఖ చేపట్టింది. తొలుత ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ స్వీకరించి వీఆర్‌వోకు అందిస్తారు. వీటిని ఆర్‌ఐ సంబంధిత గ్రామాధికారితో క్షేత్రస్థాయిలో విచారణ జరిపాక తహసీల్దార్ ద్వారా అర్హులను గుర్తించి డీఎస్‌వోకు పంపుతారు. అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపుతారు. తుది పక్రియ పూర్తయిన అనంతరం లబ్దిదారుకు రేషన్‌కార్డు జారీ చేస్తారు.