అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి:

 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్…
స్వశక్తి మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాల ఏర్పాటు…
ప్రతి అంగన్ వాడి కేంద్రం,
 ఆసుపత్రిలో ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు..
స్వీప్ యాక్టివిటీ, ఓటు నమోదు …
 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి..
ఫోటో రైటప్: వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్..
వరంగల్ బ్యూరో : సెప్టెంబర్ 2 ( జనం సాక్షి)
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, 2004 జనవరి ఒకటి నుండి 2004 డిసెంబర్ 31 వరకు జన్మించిన పిల్లల వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి వారిని నూతన ఓటరుగా నమోదు చేయాలనీ, అదే విధంగా గత సంవత్సరం కాలంలో మరణించిన వారి వివరాలను పంచాయతీ, మున్సిపాలిటీ నుండి సేకరించాలని సూచించారు.
పంచాయతీలు, మున్సిపాలిటీల నుండి వచ్చిన జాబితాను బూత్ స్థాయి అధికారుల పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలని, నూతన ఓటరు నమోదు, మరణించిన వారి తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆయన ఆదేశించారు.
జిల్లాలో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో బూత్ లెవెల్ స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు సదరు సమావేశాలు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రతి బూత్ కవర్ అయ్యేలా స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు జిల్లాలో ఉన్న గర్భవతులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడం పై శ్రద్ద వహించాలని, ఇందుకు గాను అంగన్ వాడి టీచర్లను, సహాయకులను వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఉన్న కళాశాల నుంచి విద్యార్థుల్లో అంబాసిడర్ లను ఏర్పాటు చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సూచించారు. జిల్లాలోనీ విద్యా సంస్థల్లో చదువుతున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 24 వరకు జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని, జిల్లాలో ఉన్న వ్యాపారులతో చర్చించి వారి సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు.
జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఈ వీసీ లో జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ లు హరి సింగ్, శ్రీ వాత్స, డీపీఆర్ఓ బండి. పల్లవి, సెక్షన్ సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.