అలోక్‌వర్మ పిటీషన్‌పై విచారణ వాయిదా
– 16కు వాయిదా వేసిన సుప్రింకోర్టు
– లోక్‌వర్మపై దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించిన సీవీసీ
న్యూఢిల్లీ, నవంబర్12(జనంసాక్షి) : సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ పిటీషన్‌పై విచారణను సుప్రింకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను ప్రశ్నించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) అందుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే నివేదిక రావడం ఆలస్యం కావడంతో న్యాయస్థానం సీవీసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీవీసీ నివేదిక కోసం ఆదివారమంతా ఆఫీసు తెరచి ఉంచామని, రిజిస్ట్రార్ ఎంత సేపు ఎదురు చూడాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో అన్నారు. నివేదిక రావడం ఆలస్యం కావడంతో తదుపరి విచరాణను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. ఆధిపత్య పోరుతో మొదలైన సీబీఐ వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. తనను అర్ధాంతరంగా సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆలోక్‌వర్మపై వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీవీసీని ఆదేశించింది. అంతేగాక.. తాత్కాలిక డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను కూడా కోర్టుకు సమర్పించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు గతవారం ఆలోక్‌వర్మను
సీవీసీ విచారించింది. దీనిపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను రూపొందించింది. కోర్టు గడువు నవంబరు 10తో ముగియడంతో సోమవారం ఆ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది. దీంతో పాటు నాగేశ్వరరావు తీసుకున్న ఆదేశాలను కూడా సీవీసీ న్యాయస్థానానికి అందించింది. వీటిని స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.