అవరోధాలను ఎదుర్కొంటూ..  ఎదుగుతున్నాం 

– సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటున్నాం
– 2029 నాటికి దేశంలో నెంబర్‌1 రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది
– తొలిసారి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని తెచ్చింది మేమే
– అధునాతన టెక్నాలజీని అమలు చేయడంలో అందరికంటే ముందున్నాం
– కంపెనీల ఏర్పాటుకు పూర్తిసహకారం అందిస్తాం
– ఫిన్‌టెక్‌ 2.0 సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌
విశాఖపట్టణం, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : ఎన్ని అవరోధాలు ఎదురైనా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరుస్తూ ముందుకు సాగుతున్నామని, 2022 నాటికి ప్రజల తలసరి ఆదాయంలో దేశంలోనే మూడో స్థానంలో నిలవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. మంగళవారం వైజాగ్‌ లోని నోవాటెల్‌ ¬టల్‌ లో జరుగుతున్న ఫిన్‌ టెక్‌ 2.0 సదస్సులో పలు ఐటీ కంపెనీల అధినేతలు, సీఈవోలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. 2029 నాటికి తలసరి ఆదాయంతో పాటు ఆనంద సూచీలోనూ ఆంధప్రదేశ్‌ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిఏటా 15 శాతం ఆర్థిక  వృద్ధితో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఒక్క కార్‌ కూడా లేని ఓలా దేశంలో అతిపెద్ద కార్‌ అగ్రిగేటర్‌ గా ఉందనీ, చిన్న దిండు కూడా లేని ఓయో అతిపెద్ద ¬టల్‌ బుకింగ్‌ యాప్‌ గా మారిందని లోకేశ్‌ కితాబిచ్చారు. తాను భారత్‌ తో పాటు చాలా దేశాల్లోని బ్యాంకులను సందర్శించాననీ, వాటిలో చాలా సంస్థలు తర్వాతి తరం టెక్నాలజీపై దృష్టి సారించాయని మంత్రి అన్నారు. ఆంధప్రదేశ్‌ నాలుగున్నర ఏళ్ల వయస్సు ఉన్న స్టార్ట్‌ అప్‌ అని లోకేశ్‌ అన్నారు. స్టార్ట్‌ అప్‌ కంపెనీలు ఎలా సంక్షోభాలను ఎదుర్కుంటాయో అలానే మేము కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుగుతున్నామన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ, 2029 దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలోనూ, 2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామన్నారు. లక్ష్యం నిర్దేశించుకున్న తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న అధునాతన టెక్నాలజీల పై దృష్టి పెట్టామని తెలిపారు. 4వ పారిశ్రామిక విప్లవంలో వస్తున్న అధునాతన టెక్నాలజీలు అమలు చెయ్యడంలో అందరి కంటే ముందున్నామన్నారు. ఫింటెక్‌, బ్లాక్‌ చైన్‌, డేటా అనలిటిక్స్‌ లాంటి టెక్నాలజీలను అభివృద్ధి చేస్తూ ఆయా రంగాల్లో రాష్ట్ర యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. అధునాతన టెక్నాలజీ, ఫింటెక్‌ రావడంతో సాధారణ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుందన్నారు. నూతన రాజధాని అమరావతిలో ల్యాండ్‌ రికార్డ్స్‌ డిజిటైజ్‌ చేస్తున్నామన్నారు.  బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగం ద్వారా ల్యాండ్‌ రికార్డ్స్‌ టాంపరింగ్‌ జరగకుండా రక్షణ కల్పిస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. రైతులకు క్రెడిట్‌ స్కోర్‌ ఇవ్వడం ద్వారా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా పంటబీమా, రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. డ్రోన్స్‌ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని, డ్రోన్లు వినియోగించి రియల్‌ టైం లో భూ పరీక్షలు నిర్వహించే టెక్నాలజీ పై మేలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. డ్రోన్లకు లైడార్‌ టెక్నాలజీ అనుసంధానం చెయ్యడం ద్వారా రహదారుల నాణ్యత తెలుసుకునే పైలెట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతంగా నిర్వహించామన్నారు.
సమాచారం ఆధారంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని లోకేష్‌ తెలిపారు. 10లక్షల ఐఓటి పరికరాలు వినియోగించి రియల్‌ టైం లో నీటి నాణ్యత, భూగర్భ జలాలు,వాతావరణం ఇలా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని లోకేష్‌ తెలిపారు. ప్రజాసాధికార సర్వే ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా రియల్‌ టైంలో జనాభా లెక్కలు, రియల్‌ టైం గవర్నెన్స్‌ సెంటర్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం వలన ఉద్యోగాలు పోతాయి అని అపోహ ఉందని, మన విద్యార్థులను అధునాతన టెక్నాలజీల్లో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా సిద్ధం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని లోకేష్‌ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఉన్న ఫింటెక్‌ వ్యాలీలో ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయని, విశాఖలో ఫింటెక్‌ అభివృద్ధికి కావాల్సిన పూర్తి స్థాయి ఎకో సిస్టమ్‌ సిద్ధం చేస్తున్నామన్నారు. మానిటరి అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, ఫింటెక్‌ యాసిలిరేటర్ల సహకారంతో మరిన్ని ఫింటెక్‌ కంపెనీలను ఆంధప్రదేశ్‌ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ ఫింటెక్‌ 1.0 చూశామని, ఇప్పుడు ఫింటెక్‌ 2.0 ప్రారంభమైందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ అనుసంధానం తో ఫింటెక్‌ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. అధునాతన టెక్నాలజీల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి హ్యాకథాన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.  నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంచేసి అమలు చేస్తున్నామని, విద్యార్థి స్థాయి నుండే నూతన ఆవిష్కరణల పై ఆసక్తి పెరిగేలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగాలు ఇచ్చే విధంగా స్టార్ట్‌ ఆప్‌ కంపెనీల ఏర్పాటుకి పూర్తి సహకారం అందిస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ఆంధప్రదేశ్‌ లో ఇన్నోవేషన్‌ ని వేఆఫ్‌ లైఫ్‌ గా మార్చాలని ప్రయత్నిస్తున్నామని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో నెంబర్‌ ఒన్‌ గా ఉన్నామని, ఆంధప్రదేశ్‌ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కంపెనీల ఏర్పాటుకి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు.