అవినీతిపై పోరాటం అంటే.. జగన్‌పై పోరాడాలి
– జగన్‌ను, మోదీని వదిలేసి చంద్రబాబును తిట్టడమా?
– వైసీపీ, జనసేన, బీజేపీ లాలూచీకి ఇంతకన్నా రుజువేంకావాలి
– రాఫెల్ కుంభకోణంపై పవన్ ఎందుకు మాట్లాడడు?
– పవన్‌కు దమ్ముంటే జగన్, మోదీ అవినీతిని నిలదీయండి
– కేంద్రం కక్షకట్టినా.. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం
– సీఎం కావాలంటే అందరివాడై ఉండాలి
– అందరివాడు కాబట్టే చంద్రబాబు 14ఏళ్లుగా సీఎం కాగలిగారు
– ప్రజారాజ్యం పెట్టి వైఎస్‌ను గెలిపించి.. కాంగ్రెస్‌లో విలీనం చేశారు..
– ఇప్పుడు ఎవరిని గెలిపించడానికి జనసేన పోటీ చేస్తుందో చెప్పాలి?
– విలేకరుల సమావేశంలో ఏపీ మంత్రి యనమల రామకృష్ణ
అమరావతి, అక్టోబర్16(జనంసాక్షి) : అవినీతిపై పోరాటం అంటూ చెబుతున్న పవన్ కళ్యాణ్.. ముందు జగన్, మోదీలపై పోరాడాలని, అలా కాకుండా రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబును విమర్శించడం సరియైంది కాదని ఏపీమంత్రి యనమల పవన్‌వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంగళవారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజమండ్రి కవాతులో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కొత్తదనం ఏవిూ లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించడం తప్ప అతను మాట్లాడిన దానిలో అర్థం లేదన్నారు. రాష్ట్రం నాలుగేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. కేంద్రంలో బీజేపీ కక్షకట్టి సహాయ నిరాకరణ చేస్తోందని, పట్టుదలతో ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని తెలిపారు. అయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబును విమర్శించడం లాలూచి రాజకీయమే అంటూ మండిపడ్డారు. జగన్ పైన కోపం లేదంటాడు.. జగన్ లక్షకోట్ల అవినీతి దేవుడికే తెలుసంటాడని, సిబిఐ, ఈడి ఛార్జిషీట్లలో జగన్ అవినీతి రూ.43వేల కోట్లని గుర్తించాయని, అందులో కొన్ని ఆస్తులను జప్తు చేశాయని ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు తెలియదా, తెలియనట్లు తప్పించుకుంటున్నాడంటూ యనమల ప్రశ్నించారు. జగన్ అవినీతి తనకు తెలియదంటూ పవన్ కళ్యాణ్ వెనకేసుకు వస్తున్నాడని విమర్శించారు. దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపి 3వస్థానంలో ఉందని ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సర్వే వెల్లడించిందన్నారు. ఆంధప్రదేశ్ లో అవినీతి అతితక్కువ అనేది పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు. తెలిసి కూడా అవినీతి అంటున్నాడంటే ఎవరితో లాలూచిపడ్డాడో స్పష్టం అవుతోందన్నారు. దేశంఅంతా రాఫెల్ స్కామ్ పై గగ్గోలు పెడుతోందని, కానీ రాఫెల్ పై పవన్ కళ్యాణ్ మాట్లాడరని, అవినీతిపై పోరాటం అంటే జగన్ పై పోరాడాలి, రాఫెల్ స్కామ్ సూత్రధారి మోదిపై పోరాడాలని అన్నారు. జగన్, మోదీని వదిలేసి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఏమనాలో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. బిజెపి, వైసిపి, జనసేన లాలూచికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలన్నారు. నరేంద్రమోదిపై మాట్లాడడు, జగన్ పై మాట్లాడడని, చంద్రబాబుపైనే గురిపెట్టమని పవన్ కు ఏమైనా వకాల్తా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని, ముఖ్యమంత్రి కావాలంటే అందరివాడు కావాలని యనమల అన్నారు. విూఅన్యయ్య ‘అందరివాడు’ సినిమా తీశాడు.. కానీవాస్తవంలో కొందరివాడిగానే మిగిలాడన్నారు. ఫలితంగా 18శాతం ఓట్లకే పరిమితం అయ్యాడని అన్నారు. వాటినికూడా
కాంగ్రెస్ లో కలిపేశారని గుర్తు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్, పవన్ ప్రచారం చేసినా పాలకొల్లులో అన్నయ్య ఓడిపోయాడని, అందరివాడు అనిపించుకుంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరని, కొందరివాడైతే ప్రజాదరణ పొందలేరని మంత్రి తెలిపారు. అందరివాడు కాబట్టే చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. ఆరోజు ప్రజారాజ్యం పెట్టి వైఎస్ గెలుపుకు దోహదపడ్డారని, ఆ తరువాత పీఆర్పీని కాంగ్రెస్ లో కలిపేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎవరిని గెలిపించడానికి జనసేన పోటీ చేస్తోందని, తరువాత ఎవరితో కలిసిపోతుంది అనేది ప్రజలకు ముందే పవన్ వివరంగా చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణ ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయని, విూ సత్తాఏమిటో రేపు వాటిలో చూపించండి అని సవాల్ చేశారు. పంచాయతీ ఎన్నికలు పెడితే సత్తా చూపిస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే టీడీపీ గెలుపొందిందని, బీజేపీ, పవన్ ప్రచారం తరువాతే టిడిపికి సీట్లు తగ్గాయన్నారు. జగన్, పవన్, కేసీఆర్ భాషా పాండిత్యం ఒక్కటేనని, టీడీపీ పై దుర్భాషలాడటంలో, మోదీ పెట్టిన తిట్ల పందెంలో ముగ్గురూ పోటీబడుతున్నారని యద్దేవా చేశారు. జగన్, పవన్ దృష్టి అంతా ముఖ్యమంత్రి కుర్చీపైనే ఉందని, పదవి కోసం చేసే రాజకీయాన్ని ప్రజలు ఆమోదించరని మంత్రి యనమల పేర్కొన్నారు.