అవినీతి పరులను..  బాబు పెంచిపోషిస్తున్నాడు


– అవినీతి సామ్రాట్లు కాకపోతే ఐటీ దాడులతో భయమెందుకు
– ఐటీ తనిఖీలను రాష్ట్రంపై దాడిగా చిత్రీకరిస్తున్నారు
– టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పన్నులు, విద్యుత్‌ బకాయిలు కట్టకుంటే ఊరుకోవాలా?
– కాంగ్రెస్‌ నేతలు ముద్దాయిలని చంద్రబాబే అన్నాడు
– ఇప్పుడు ఆ ముద్దాయిలతోనే కలిసిపోతున్నాడు
– నవంబర్‌ 1 నుంచి బీజేపీ ఇంటింటికి కార్యక్రమం
– ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
– నెల్లూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కన్నా
నెల్లూరు, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో అవినీతిపరులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తున్నాడని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. నెల్లూరులో బీజేపీ నూతన కార్యాలయానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. అవినీతిపరులను అంతమొందించాలని డిమాండ్‌ చేసిన తెలుగుదేశం పార్టీయే ఇప్పుడు ఐటీ దాడులకు భయపడుతుందని ఆరోపించారు. టీడీపీ నేతలు అవినీతి సామ్రాట్లు కాకపోతే ఐటీ దాడులకు ఎందుకు భయపడుతున్నారని కన్నా ప్రశ్నించారు. ఐటీ అధికారులు వాళ్లపని వాళ్లు చేసుకుని వెళ్తారని అన్నారు. బాబ్లీ, ఐటీ దాడులను కేంద్రంపై నెట్టి లబ్దిపొందాలని టీడీపీ నేతలు చూస్తున్నారని విమర్శించారు కన్నా. మరోవైపు నవంబర్‌ నుంచి ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కన్నా పిలుపునిచ్చారు. కేందప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రెండుకళ్ల సిద్ధాంతం బీజేపీకి లేదంటూ టీడీపీపై సెటైర్లు వేసిన ఆయన… ప్రత్యేక ¬దా పేరుతో రాష్ట్ర అభివృద్ధిని పలు పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఏపీని అన్ని విధాలా ఆదుకుంటోందని… ఆ రోజు ప్యాకేజీకి ఒప్పుకుని నేడు చంద్రబాబు డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు. అప్పుడు కాంగ్రెస్‌ నేతలను ముద్దాయిలు అన్న బాబు ఇప్పుడు అదే ముద్దాయిలతో కలిసి తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయన్నవారే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఐటీ తనిఖీలను రాష్ట్రంపై దాడిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జీఎస్టీ పన్నులు, విద్యుత్‌ బకాయిలు చెల్లించకుంటే చూస్తూ ఊరుకోవాలా అని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అండ్‌ కో దోపిడీనే ధ్యేయంగా పెట్టుకొని పాలన సాగిస్తున్నారని అన్నారు. పలుమార్లు అవినీతిపై ప్రశ్నించినా వారి తీరులో మార్పు రావడం లేదని, ఇసుక, మట్టి, జన్మభూమి కమిటీలు ఇలా అన్నింటిలోనూ ప్రజలను దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం ఏపీకి అన్ని విధాల సాయపడుతున్నా ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందని అనడం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమన్నారు. కేంద్రం ఎప్పుడూ ఏపీకి అండగానే ఉంటుందని కన్నా స్పష్టం చేశారు.

తాజావార్తలు