అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..  ముందుకెళ్తున్నాం


– నాలుగేళ్లలో ఏపీ ప్రతిష్టను పెంచాం
– జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్ష భేటిలో కూర్చోరా?
– జగన్‌, మోదీ ప్రణాళికలను కన్నా అమలుచేస్తున్నాడు
– కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు బ్లాక్‌డేగా పాటించాలి
– శాంతియుతంగా బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన తెలపండి
– కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుంది
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జనవరి30(జ‌నంసాక్షి) : ప్రపంచలోనే ప్రముఖ కంపెనీలుగా పేరొందిన వాటిని ఏపీకి తీసుకొస్తున్నామని, తద్వారా నాలుగేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ప్రతిష్టను పెంచామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఎలక్షన్‌ మిషన్‌ -2019పై టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపక్క రైతులకు నీళ్లిచ్చాం, మరోవైపు కియ వచ్చిందని, ఇంకోపక్క ఏపీకి జీవనాడిగా పేరొందించిన పోలవరాన్ని పూర్తిచేస్తున్నామని అన్నారు. ఒకప్పుడు రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు పరిశ్రమలకు కేంద్రంగా మారిందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమల్లో ముందంజలో ఉన్నామని, అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేస్తూ.. పాలనలో ముందుకెళ్తున్నామని అన్నారు. వైఎస్‌ హయాంలో లేపాక్షి హబ్‌, సైన్స్‌ సిటి ఏమైందని ప్రశ్నించారు. తాము తెచ్చిన వోక్స్‌ వ్యాగన్‌ను తరిమేశారని చంద్రబాబు మండిపడ్డారు. జర్మనీలో అధికారులను జైల్లో పెట్టించారని గుర్తుచేశారు. ఇక్కడ జగన్‌, బొత్స పోజులు కొడుతున్నారని, అంతర్జాతీయంగా ఏపీకి అప్రదిష్ట తెచ్చారని విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లలో ఏపీ ప్రతిష్టను టీడీపీ పెంచిందని సీఎం చెప్పుకొచ్చారు.  వైసీపీ నేతలు టీడీపీతో కలిసి భేటీలో కూర్చోబోమనడం హాస్యాస్పదంగా ఉందన్న చంద్రబాబు.. జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్ష భేటిలో కూర్చోరా అంటూ దుయ్యబట్టారు. 16ఏళ్లలో కన్నా తనపై మూడు పిటిషన్లు వేశారని, వైఎస్‌ స్వయంగా 13 పిటిషన్లు వేశారని, అనుచరులతో 12కేసులు వేయించారని బాబు గుర్తుచేశారు. తొమ్మిదేళ్లలో మొత్తం 25కోర్టు కేసులు వేశారన్నారు. జగన్‌ తల్లితో 2, 464 పేజీల పిల్‌ వేయించారని తెలిపారు. తనపై వేసిన అన్ని పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయని, ఒక్క ఆరోపణను రుజువు చేయలేక పోయారన్నారు. ఏపీకి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించే పోలవరం, అమరావతి, పట్టిసీమపై కేసులు వేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్ని కేసులు వేసిన వాటన్నింటిని నిరూపించుకుంటూ పట్టిసీమను పూర్తిచేశామని, 2019 నాటికి పోలవరం పూర్తవుతుందని, అమరావతిని కూడా ప్రపంచంలోనే పేరొందిన రాజధానిగా తీర్చిదిద్దుతామని బాబు పేర్కొన్నారు. జగన్‌, మోదీ కుట్రలను కన్నా అమలు చేస్తారని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. జగన్‌ అత్యాశ రాష్ట్రానికే పెనుప్రమాదమన్నారు. అత్యాశతోనే జగన్మోహన్‌రెడ్డి పతనం ఖాయమని స్పష్టంచేశారు. డబ్బు, అధికార వ్యామోహం ఉండకూడదని హితవుపలికారు.
విపత్తుసాయంలోనూ ఏపీపై వివక్షచూపారు..
మోదీ పాలన వైఫల్యాలపై చైనాలో ప్రచారం జరుగుతోందని, చైనా గ్లోబల్‌ టైమ్స్‌ కథనాలే మోదీ వైఫల్యాలకు రుజువని చంద్రబాబు పేర్కొన్నారు. మోదీపై నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉందని సీఎం తెలిపారు. విపత్తు సాయంలోనూ ఏపీపై మోదీ వివక్ష చూపించారని మండిపడ్డారు. మహారాష్ట్రకు రూ.4,717 కోట్లు ఇచ్చి ఏపీకి రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 347మండలాల్లో కరువును కేంద్రం పట్టించుకోలేదన్నారు. తితలీ తుఫాన్‌ వల్ల వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. బీజేపీ చిత్తుగా ఓడిపోతేనే ఏపీకి
న్యాయం చూకూరుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ 60రోజులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు బ్లాక్‌ డే అని, నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసన తెలపాలని ఆదేశించారు. శాంతియుతంగానే నిరసనలు ఉండాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యతలే పదవులకు ప్రామాణికమన్నారు. కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం శాశ్వతంగా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.