అసెంబ్లీకి పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ వాడుతున్నాం

ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇది

స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): అసెంబ్లీలో పింక్‌ కలర్‌ బ్యాలట్‌ వాడడం ఆనవాయితీగా వస్తోందని, దీనికి ఎలాంటి ప్రత్యేకత ఏవిూ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే తప్పు కూడా కానది తెలియచేసింది. ఎన్నికల కమిషన్‌ నిబంధన ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్లను, లోక్‌సభ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. గత కొన్నేళ్ల నుంచి ఈ నిబంధనను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్లు వినియోగించొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ స్పందించింది. డిసెంబర్‌ 7న జరిగే శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 90 లక్షల ఈవీఎంల కోసం 90 లక్షల బ్యాలెట్‌ పేపర్లను ప్రింటింగ్‌ చేయాలని రెండు వారాల క్రితమే ఆర్డర్‌ చేసింది. వీటన్నింటిని పింక్‌ కలర్‌లోనే ముద్రించాలని ఈసీ ఆదేశించింది. ఒకప్పుడు ఓటింగ్‌కు బ్యాలెట్‌ పేపర్లను ఉపయోగించేవారు. అయితే సాంకేతిక పెరిగిపోవడంతో బ్యాలెట్‌ స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈ ఈవీఎంలపై పార్టీ గుర్తులుండే పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్లను అతికిస్తారు. పార్టీ గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్‌ను ఓటర్లు నొక్కడంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అవుతోంది.