అసోంలో ఆగని హింస
మళ్లీ చెలరేగిన అల్లర్లు .. ఐదుగురి మృతి
చిరాంగ్ ,ఆగస్టు 25 (జనంసాక్షి): అసోంలో శాంతి భద్రతల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్గి రాజుకుంటుందో, ఏ క్షణంలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గంపై విరుచుకుప డుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. స్థానిక బోడో జాతి వర్గీయులకు, ప్రవాస బంగ్లాదేశీయులకు మధ్య జరుగుతున్న అల్లర్లు ఇప్పట్లో ఆరేలా లేవు. చిరాంగ్ జిల్లాల్లో శనివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా శరణార్థ శిబిరం నుంచి వెళ్తుండగా దాడి జరగడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో మొన్నటి వరకు 77గా ఉన్న మృతుల సంఖ్య శనివారంతో 82కు చేరింది. ఈ తాజా అల్లర్లతో అప్రమత్తమైన పోలీసులు సున్నిత ప్రాంతాల్లో భారీ గస్తీ నిర్వహిస్తున్నారు. స్థానికులు మాత్రం మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.